mt_logo

కాకతీయ వైభవ సప్తాహంకు ఘనంగా ఏర్పాట్లు : మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం జూలై 7వ తేదీ నుంచి 7 రోజుల పాటు వరంగల్ లో ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహించనుంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సోమవారం ప్రగతి భవన్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవాన్ని చాటేలా ‘కాకతీయ వైభవ సప్తాహం’ను నిర్వహించాలని ఆదేశించారు. కాకతీయుల వైభవాన్ని, ప్రతిష్టను పెంచేవిధంగా రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనేలా కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు భాగస్వాములు అయ్యేలా సాహితీ, సాంస్కృతిక, కళా కార్యక్రమాలను, అందరూ గర్వ పడేలా ఉత్సవాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వరంగల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా, పండుగ వాతావరణం నెలకొనేలా విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. కాకతీయ వైభవ సప్తాహంను విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేసుకోవాలని మంత్రులు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *