mt_logo

కాకతీయుల చరిత్రను తెలిపే ఫోటో ఎగ్జిబిష‌న్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

కాక‌తీయ వైభ‌వ స‌ప్తాహంలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం కాక‌తీయ రాజుల చ‌రిత్ర‌ను తెలియ‌జేసే ఫొటో ఎగ్జిబిష‌న్‌ను వ‌రంగ‌ల్‌లో ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, ఏడు శ‌త‌బ్దాల చ‌రిత్ర క‌లిగిన కాక‌తీయుల గొప్ప‌త‌నాన్ని తెలుసుకోవ‌డానికి ఇది మంచి కార్య‌క్ర‌మ‌మ‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మం ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించగా… వారంపాటు కాక‌తీయ వైభ‌వ సప్తాహం గొప్పగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాక‌తీయుల వైభ‌వాన్ని ఈ త‌రానికి గొప్ప‌గా చెప్పుకునేలా ఈ కార్యక్రమాన్ని చేశామ‌న్నారు. కానీ కాక‌తీయ సామ్ర‌జ్యం, వారి గొప్ప‌త‌నం చెప్పాలంటే కొన్ని నిమిషాలు స‌రిపోవ‌ని, ఫొటో ఎగ్జిబిష‌న్ చూస్తున్న‌ప్పుడు గొప్ప‌గా అనిపించింద‌న్నారు. అదే స‌మ‌యంలో కొంత బాధ‌ కూడా అనిపించింద‌న్నారు. విదేశాల్లో చ‌రిత్ర‌కు సంబంధించిన ఏ చిన్న వ‌స్తువు, అంశం క‌నిపించినా భ‌ద్రంగా కాపాడి, భ‌విష్య‌త్ త‌రాల‌కు అందిస్తార‌ని చెప్పారు. ఇక‌పై మ‌నం కూడా అదే త‌ర‌హాలో కాక‌తీయుల చ‌రిత్ర‌ను భ‌విష్య‌త్ త‌రాల‌కు అందిద్దామ‌న్నారు. కాక‌తీయులు అన్ని మ‌తాలు, సంస్కృతుల స‌మ్మేళ‌నంగా పాల‌న సాగించార‌ని చెప్పారు. అన్ని మ‌తాల క‌ట్ట‌డాల‌ను అద్భుతంగా రూపొందించార‌న్నారు. కాక‌తీయుల గొలుసు క‌ట్టు చెరువులే మ‌న మిష‌న్ కాకతీయ‌కు స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణ సాధించుకున్న త‌ర్వాత ములుగులోని రామ‌ప్ప‌కు ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద‌గా గుర్తింపు ల‌భించ‌డం అతి గొప్ప విజ‌య‌మ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాకతీయుల చ‌రిత్ర‌పై ప‌రిశోధ‌న చేసిన అర‌వింద్ ఆర్య‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. కాక‌తీయ వైభ‌వ స‌ప్తాహానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాక‌తీయుల వార‌సుడు క‌మ‌ల్ చంద్ర భంజ్‌దేవ్‌కు మంత్రి కేటీఆర్‌ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *