కుల, మత పిచ్చోళ్లు మనకొద్దని … మనకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి మరియు అభాగ్యులకు ఆసరాగా నిలిచే ప్రభుత్వమని అన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉందని, ఎవరేం చెప్పినా పట్టించుకోవద్దు అని కేటీఆర్ సూచించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో రూ.170 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ… టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పని చేస్తుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటున్నామని, గత ప్రభుత్వాల్లో కానీ పనులు సైతం కేసీఆర్ నాయకత్వంలో పరిష్కారం అయ్యాయని కేటీఆర్ పేర్కొన్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గోపాల్ దిన్నె రిజర్వాయర్ ద్వారా 25 వేల ఎకరాలకు నీరు ఇవ్వబోతున్నామని కేటీఆర్ తెలిపారు. బాచారం హై లెవల్ కాలువను మంజూరు చేయించే ప్రయత్నం చేస్తామన్నారు. సోమశిల మీద బ్రిడ్జి కావాలని ఎమ్మెల్యే మొండిపట్టు పట్టి సాధించారు. ఆంధ్రాకు, తెలంగాణకు మధ్య కొల్లాపూర్ జంక్షన్‌గా మారిపోయే అవకాశం ఉంది. మామిడి మార్కెట్‌ను కూడా నియోజకవర్గానికి తీసుకొచ్చామన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమలను తేవాలని ఎమ్మెల్యే కోరారు. భూమిని కేటాయిస్తే తప్పకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను తీసుకొస్తామన్నారు. సోమశిలలో 35 కాటేజీలు నిర్మించాం. అమరగిరిలో కూడా ఎకో టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామన్నారు. ఉద్యానవన పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయించే ప్రయత్నం చేస్తామన్నారు. 98 జీవోను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కరోనాతో పాటు ఇతర సమస్యల కారణంగా గత మూడేండ్లుగా కొత్త పెన్షన్లు రాలేదు. వారందరికీ జులై, ఆగస్టు నెలలో కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. రేషన్ కార్డులు లేని వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు. అభివృద్ధే కులంగా, సంక్షేమమే మతంగా, జనహితమే అభిమతంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. 8 ఏండ్లలో ఏ రాష్ట్రంతోనూ ఎలాంటి పంచాయితీలు పెట్టుకోలేదు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేసుకుంటూ ముందుకు పోతున్నామని పేర్కొన్నారు.