mt_logo

32 మిలియన్ల యూఎస్ డాలర్ల పెట్టుబడులు, 1.6 మిలియన్ల ప్రత్యక్ష ఉద్యోగాలు తెచ్చాము : మంత్రి కేటీఆర్

ఫ్రాన్స్‌లో అతిపెద్ద ఎంప్లాయర్‌ ఫెడరేషన్‌ అయిన ‘మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ది ఎంటర్‌ప్రైజెస్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ (మెడెఫ్‌)’ ప్రతినిధులతో గురువారం హోటల్‌ తాజ్‌ కృష్ణలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలోని పలు ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపకులకు ఇన్వర్టర్లు, జనరేటర్లకు సబ్సిడీలు ఇస్తుంటే, తాము మాత్రం వ్యవసాయం, పరిశ్రమలు, గృహావసరాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నట్టు చెప్పారు.

ఏ రాష్ట్రమైనా పెట్టుబడిదారులకు తమకన్నా మెరుగైన ప్యాకేజ్‌ ఇచ్చేందుకు ముందుకొస్తే, తాము వారికన్నా మంచి ప్యాకేజీ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కేటీఆర్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మెడెఫ్‌ ప్రతినిధులను కోరారు. తెలంగాణకు ఉన్న ప్రత్యేకతలు, ఇక్కడ స్థాపించిన ప్రధాన సంస్థలు, చారిత్రక వైభవం తదితర అంశాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వారికి వివరించారు.

పారిశ్రామిక అనుకూల విధానాలు తెలంగాణలో అమలవుతున్నట్టు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇందులో టీఎస్‌ ఐపాస్‌ అత్యంత ప్రధానమైనదని, ఎక్కడా లేని విధంగా సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ విధానంలో పరిశ్రమలకు అనుమతులిస్తున్నామని తెలిపారు. 15 రోజుల్లోగా అనుమతులు రాకుంటే అది డీమ్డ్‌ టు బీ అప్రూవ్డ్‌ కింద పరిగణిస్తామని, అనుమతులు రాకుంటే బాధ్యుడైన అధికారికి జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. ఇటువంటి విధానం ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా లేదన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇప్పటివరకు 20 వేలకుపైగా యూనిట్లకు అనుమతులు ఇచ్చినట్టు, 32 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు, 1.6 మిలియన్ల ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చినట్టు చెప్పారు. టెక్స్‌టైల్‌ పాలసీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ, ఎలక్ట్రానిక్స్‌ పాలసీ తదితర పాలసీల ద్వారా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి వివరించా రు. వివిధ రంగాల్లో తమ అత్యుత్తమ ప్రదర్శనకుగాను రాష్ట్రానికి అనేక అవార్డులు, రివార్డులు లభించినట్టు చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి అమెరికా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌ తదితర దేశాల్లోని సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు చెప్పారు

హైదరాబాద్‌ చరిత్ర, సంస్కృతి, వారసత్వం ఎంతో పురాతనమైనవని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. శాంతి భద్రతల పర్యవేక్షణే కాకుండా బహుళ ప్రయోజనార్థం ట్విన్‌టవర్స్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను నిర్మించినట్టు చెప్పారు. ఇది దేశంలోనే అత్యంత అధునాతనమైనదని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్‌ టీ-హబ్‌ను నిర్మించినట్టు, ఇక్కడ 2,000 స్టార్టప్స్‌ అభివృద్ధి చెందినట్టు చెప్పారు. దేశంలోనే ప్రఖ్యాత బిజినెస్‌ స్కూల్‌ ఐఎస్‌బీ ఇక్కడే ఉన్నదని, ప్రపంచ ప్రఖ్యాత అమెజాన్‌ సంస్థ అతిపెద్ద క్యాంపస్‌ను ఇక్కడ ఏర్పాటు చేసిందని వివరించారు.

అందులో 1,500 మందికిపైగా పనిచేస్తున్నారని చెప్పారు. దేశంలో భౌగోళికంగా తెలంగాణ 11వ, జనాభాపరంగా 12వ అతిపెద్ద రాష్ట్రం అయినప్పటికీ జీఎస్డీపీలో అనేక పెద్ద రాష్ట్రాల కన్నా ముందున్నదని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నాలుగేండ్లలోనే నిర్మించినట్టు, దీని కోసం రూ.లక్ష కోట్లకన్నా ఎక్కువ నిధులను ఖర్చు చేసినట్టు తెలిపారు. సాగునీటి ప్రాజక్టుల కారణంగా సాగుభూమి రెట్టింపైందని, పంటల దిగుబడి భారీగా పెరిగిందని అన్నారు. వ్యవసాయ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని, ఐటీ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని చెప్పారు.

తెలంగాణ అనతికాలంలో దేశంలో ఐటీ సూపర్‌హబ్‌గా ఎదిగిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అమెజాన్‌, యాపిల్‌ వంటి అనేక ప్రపంచ ప్రఖ్యాత బహుళజాతి సంస్థలు హైదరరాబాద్‌లోనే తమ అతిపెద్ద క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్లలో మూడోవంతు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. నోవార్టీస్‌ సంస్థ రెండో అతిపెద్ద క్యాంపస్‌ను ఇక్కడే ఏర్పాటు చేసిందన్నారు.

ఐటీ ప్రొఫెషనల్స్‌, బయో టెక్నాలజీ ఇంజినీర్లకు ఇక్కడ కొదవలేదని తెలిపారు. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగంలో సైతం తెలంగాణ దూసుకుపోతున్నదని, శాఫ్రాన్‌, బోయింగ్‌, జీఈ తదితర ప్రధాన కంపెనీలు ఇక్కడ తమ పరిశ్రమలను ఏర్పాటుచేశాయని గుర్తు చేశారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలోనూ తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని, ప్రపంచంలో తయారయ్యే ఐదుటీవీల్లో ఒకటి ఇక్కడే తయారవుతున్నట్టు చెప్పారు. క్వాల్కం, ఇంటెల్‌ వంటి సంస్థలు బ్రాంచీలు ఇక్కడ ఉన్నాయని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *