హైదరాబాద్ పౌరుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ (SRDP) కార్యక్రమం కింద రూ.143.58 కోట్లతో చేపట్టిన నాగోల్ ఫ్లైఓవర్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. 990 మీటర్ల పొడవుతో ఆరు లేన్లుగా నిర్మించిన ఈ టూ వే ఫ్లైఓవర్‌తో ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వరకు వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించడానికి అవకాశం ఏర్పడనుంది. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలకు ట్రాఫిక్ సమస్యల నుంచి ఊరట లభించనుంది.
మాదాపూర్, గచ్చిబౌలి, ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రెండు ఫ్లై ఓవర్లను జీహెచ్‌ఎంసీ నిర్మించింది. అందులో కొత్తగూడ ఫ్లై ఓవర్ ఒకటి కాగా మరొకటి శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి కావస్తున్నాయి. ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ను నవంబర్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగూడ ఫ్లై ఓవర్ పనులు త్వరలో పూర్తవుతాయి. డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభోత్సవం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
