హైదరాబాద్ నగరంలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారాలు దొరికేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైన చోట ఆర్‌యూబీలు, ఆర్వోబీలు నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తుకారం గేట్ వద్ద రోడ్ అండర్ బ్రిడ్జి(ఆర్‌యూబీ)ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. అడ్డగుట్ట, లాలాపేట డివిజన్ల ప్రజలకు ఈ ఆర్‌యూబీ ద్వారా అపారమైన లాభం జరగబోతోంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది. 72 కోట్లతో రోడ్డు అండర్ బ్రిడ్జిని నిర్మించామన్నారు. మొత్తానికి ఈ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
సికింద్రాబాద్ నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ నేతృత్వంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్ల విస్తరణ, ఆర్‌యూబీల నిర్మాణంతో పాటు కొత్తగా కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పద్మారావు గౌడ్ నాయకత్వంలో సికింద్రాబాద్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందనే సంపూర్ణ విశ్వాసం తనకు ఉందన్నారు. ఈ తుకారం గేట్ ఒక్కటే కాదు… జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్ఆర్‌డీపీ కింద 6 వేల కోట్ల విలువ చేసే పనులు పూర్తి చేసుకున్నామని తెలిపారు. నగరంలో ఆర్‌యూబీలు, ఆర్వోబీల నిర్మాణంపై ఇటీవలే రైల్వే శాఖతో చర్చించాం. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరికేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం గట్టి పట్టుదల, కృత నిశ్చయంతో ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు