mt_logo

గండిపేటను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతాం : మంత్రి కేటీఆర్

మంగళవారం గండిపేట జలాశయం వద్ద రూ.36 కోట్లతో అభివృద్ధి చేసిన అత్యాధునిక పార్కును రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే కొత్వాల్‌గూడలో 85 ఎకరాల్లో రూ.300 కోట్లతో నిర్మించనున్న ఎకో పార్కుకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్  మాట్లాడుతూ… అత్యంత వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ మహానగర తాగునీటి అవసరాల కోసం మరో 50 ఏండ్లకు సరిపోయేలా కృష్ణ, గోదావరి నదుల నుంచి నీటిని తీసుకువస్తున్నామని తెలిపారు. 100 ఏండ్ల చరిత్ర ఉన్న గండిపేట జలాశయం నీళ్లు ఎప్పటికీ సురక్షితంగా, కలుషితం కాకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు జంట జలాశయాలను అత్యాధునిక పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో భాగంగానే గండిపేటలో మొదట 6 ఎకరాల్లో రూ.36 కోట్లతో పార్కును అభివృద్ధి చేసి ప్రారంభించామని తెలిపారు. అదేవిధంగా గండిపేట చుట్టూ మొత్తం 46 కి.మీ పొడవు ఉన్నదని, దీని చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడంతో సైక్లింగ్‌ ట్రాక్‌ నిర్మాణం చేపట్టి, దేశ స్థాయిలో సైక్లింగ్‌ పోటీలు ఇక్కడ నిర్వహించేలా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గండిపేట చెంతనే మరో 70 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం ఇదే స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఆ పనులను హెచ్‌ఎండీఏకు అప్పగిస్తామని పేర్కొన్నారు. 

గచ్చిబౌలి-శంషాబాద్‌ ఔటర్‌ రింగు రోడ్డుకు ఇరువైపులా కొత్వాల్‌గూడలో ఉన్న 85 ఎకరాల హెచ్‌ఎండీఏ స్థలంతో పాటు 40 ఎకరాల టూరిజం శాఖ స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు రూపొందించిందని, అందులో భాగంగానే కొత్వాల్‌గూడలో ఎకో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సుమారు రూ.300 కోట్లతో కొత్వాల్‌ గూడలో ఎకో పార్కును అభివృద్ధి చేస్తామని, ఇది నగర వాసులకు అతి పెద్ద ఆట విడుపు, ఆహ్లాదకర ప్రదేశంగా మారుతున్నదని తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్‌ నగరానికి ఈ ప్రాంతం దిక్సూచిగా మారనున్నదని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద అక్వేరియం, ఏవియెరి (పక్షిశాల), రెండు చెరువుల చుట్టూ నడిచి వెళ్లేలా బోర్డు వాక్‌ నిర్మిస్తామని తెలిపారు.

రింగు రోడ్డుకు అవతలివైపు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. నగరానికి ఉపయోగపడే విధంగా ఆధునిక సౌకర్యాలతో వసతి, పార్కింగు యార్డుతోపాటు భారీ కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మిస్తామని తెలిపారు. కొత్వాల్‌ గూడకు వచ్చే మార్గాన్ని 100 ఫీట్ల రోడ్డుగా మారుస్తామన్నారు. రెండు చెరువులను సంరక్షించుకునేలా ఎకో పార్కులను అభివృద్ధి చేసి, చుట్టు పక్కల ప్రాంతాల రూపురేఖలను మార్చేలా వ్యూహరచన చేసినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శంషాబాద్‌ నుంచి హైదరాబాద్‌ సిటీలోకి వస్తుంటే మారిన నగర రూపురేఖలు కనిపిస్తున్నాయని అన్నారు. నగర వాసులకు అనుగుణంగా ఆహ్లాదకరమైన పార్కులు, వీకెండ్‌ స్పాట్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

ఫిరంగి నాలా, బుల్కా నాలాపై ఉన్న కబ్జాలను ఉపేక్షించేది లేదని, ఎంతటి వారివైనా తొలగించి, వరద నీరు సాఫీగా ముందుకు వెళ్లిపోయేలా నాలాలను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రసుత్తం నగరంలో నాలాలు కబ్జాకు గురికావడంతోనే ముంపు సమస్య తలెత్తుతున్నది అన్నారు. ఇక నుంచి అలాంటి వాటిని ప్రజా ప్రతినిధులు ఏమాత్రం ప్రోత్సహించవద్దని మంత్రి కేటీఆర్‌ వారికి సూచించారు.

ఉస్మాన్‌ సాగర్‌, హిమయత్‌ సాగర్‌ జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జీవో నం.111 ఎత్తివేసిన తర్వాత ఈ ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అయితే అభివృద్ధితోపాటు రెండు జంట జలాశయాల పరిరక్షణ, భావితరాలకు వాటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా సీవరేజీ నీరు జంట జలాశయాల్లోకి రాకుండా నియంత్రించి కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు జలాశయాల్లోకి కలుషిత నీరు వెళ్లకుండా ప్రత్యేకంగా సీవరేజీ లైన్లు నిర్మించి మురుగునీటిని మళ్లిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అర్వింద్‌కుమార్‌, రంగారెడ్డి జెడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అనితా రెడ్డి, హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రభాకర్‌, ఆర్‌డీఓ చంద్రకళ, రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, స్థానిక కౌన్సిలర్లు, హెచ్‌ఎండీఏ అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *