సీఎం కేసీఆర్ ఇటీవల 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల నోటోఫికేషన్ గురించి వెల్లడించగా… ఈ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కీలక సూచనలు చేశారు. 6 నెలలు చదువుపై శ్రద్ధ పెట్టి చదవండని, సినిమాలు, క్రికెట్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని హితవు పలికారు. మీ తల్లిదండ్రులను సంతోషపెట్టే విధంగా భవిష్యత్‌కు ప్రణాళికలు వేసుకోవాలని ఉద్యోగ అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ సూచించారు. సోమవారం పీర్జాదిగూడ పరిధిలో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను ప్రారంభిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ‘మల్లారెడ్డి చాలా మంచి వక్త అని, అన్ని విషయాలు మనసుకు ఎక్కేవిధంగా మాట్లాడతారని అన్నారు. నిన్న కాక మొన్న శాసనసభలో 90 వేల ఉద్యోగాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తే… రాష్ట్రంలో మొదటిసారిగా ఉచిత కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించిన ఘనత మల్లారెడ్డికే దక్కుతుందన్నారు. కోచింగ్ సెంటర్‌లో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. 3 నుంచి 4 నెలల పాటు ఈ కోచింగ్ సెంటర్ కొనసాగుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాసులు కొనసాగుతాయి. మధ్యాహ్న భోజనంతో పాటు స్నాక్స్ కూడా ఇవ్వనున్నారు. ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు కేటీఆర్ సూచించారు.
టీ శాట్ ను ఉపయోగించుకోండి :
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొవిడ్ కంటే ముందు టీ శాట్ ద్వారా విద్య, నిపుణ చానెల్‌ను ప్రారంభించామని కేటీఆర్ తెలిపారు. యూట్యూబ్‌లో కూడా ఈ చానెల్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి కంటెంట్ ఈ చానెల్లో లభ్యమవుతుందన్నారు. ఈ చానెల్‌ను వాడుకోవాలని సూచిస్తున్నాను. మీ కోసమే ప్రభుత్వం ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.
ఒక్కో ప్రభుత్వ ఉద్యోగానికి పదుల సంఖ్యలో పోటీ ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పోటీతత్వంతో గట్టిగా చదివితే ఉద్యోగం వస్తదనే విశ్వాసం వస్తుంది. ఒక వేళ ఉద్యోగం రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. టీఎస్ ఐపాస్ ద్వారా 19 వేల పరిశ్రమలు వచ్చాయి. 13 వేల పరిశ్రమలు పనులు ప్రారంభించాయి. మరో 6 వేల పరిశ్రమలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రయివేటు రంగంలో కూడా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. తెలంగాణ పిల్లలకు కొలువులు ఇచ్చినట్లు అయితే ప్రోత్సాహకాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రయివేటు రంగంలో కచ్చితంగా మన పిల్లలకే సింహ భాగం అవకాశాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. టీ హబ్, వీ హబ్ లాంటి సంస్థల్లో కూడా పారిశ్రామిక ఔత్సాహికులకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. 15 లక్షల 62 వేల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. వాళ్లు కూడా నింపక తప్పదు. దాంట్లో మనకు కూడా 60 నుంచి 70 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. చదవడం వల్ల నష్టం ఉండదు. ఏదో ఒక రోజు ఉద్యోగం వస్తుంది. నైపుణ్య శిక్షణ(స్కిల్) పొందాలి. అప్ స్కిల్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు రీ స్కిల్ చేసుకోవాలి. ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలి. ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా మీరు తయారు కావాలి. టాస్క్ ఆధ్వర్యంలో శిక్షణ కూడా ఇస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా మనకు మనం ఆవిష్కరించుకోవాలి. ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో వచ్చే ఉద్యోగాలకు పోటీ పడుతూనే ఇతర అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.