హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీగా చేసేందుకు చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ఫలాలు విడుతల వారీగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్‌ఆర్‌డీపీ మొదటి దశలో చేపట్టిన 47 పనుల్లో సుమారు 30 పనులు పూర్తి కాగా, అందులో 13 ఫ్లై ఓవర్లు, 7 అండర్ పాసులు ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా రూ.69 కోట్లతో బహదూర్‌పురలో 690 మీటర్ల పొడవునా నిర్మించిన మల్టీలెవల్ ఫ్లై ఓవర్‌ను మంగళవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు. బహదూర్‌పుర ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో రవాణా సమయం తగ్గడం, ఇంధన కాలుష్య నియంత్రణ, బహదూర్‌పుర జంక్షన్‌లో సిగ్నల్ ఫ్రీ రవాణా సౌకర్యం ఉంటుంది. 13 పిల్లర్స్, ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఆరాంఘర్ నుంచి ఉప్పల్ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణం ఈజీగా సాగడంతోపాటు సకాలంలో గమ్యస్థానం చేరుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ వాణీదేవి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు.

