సిరిసిల్లకు మెగాపవర్‌లూం క్లస్టర్ ఇవ్వాలని, తెలంగాణకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూం మంజూరు చేయాలని పదేపదే చేసిన విజ్ఞప్తులను కేంద్రం ప్రభుత్వం పట్టించుకోలేదని రాష్ట్ర ఐటీ, చేనేత జౌళి శాఖల మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం సిరిసిల్ల పట్టణ శివారులోని మానేరు బ్రిడ్జి సమీపంలో ఎల్లమ్మ గుడి వద్ద రూ.50 లక్షలతో ఏర్పాటుచేసిన కొండా లక్ష్మణ్ కాంస్య విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద రూ.కోటితో ఆధునికీకరించిన ముస్లిం శ్మశానవాటిక, రూ.18 లక్షలతో కొనుగోలుచేసిన ఆఖరీ సఫర్ వాహనాన్ని ప్రారంభించారు. రూ.2 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఆధునికీకరణ, రూ.2.29 కోట్లతో చేపట్టనున్న వెంకంపేట మెయిన్‌రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల అర్బన్ మండలం రాజీవ్‌నగర్‌లో రూ.13 లక్షలతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ భవనాన్ని ప్రారంభించారు.
కొండా లక్ష్మణ్ విగ్రహం వద్ద జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. గుజరాత్‌లో మహాత్మాగాంధీ చరఖా తిప్పి నూలు వడికి స్వదేశీ ఉద్యమానికి నాంది పలికితే.. అదే నూలుపై సిగ్గు లేకుండా ఐదు శాతం పన్నువేసిన మొదటి ప్రధాని నరేంద్ర మోదీ అని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పన్నులు ఉపసంహరించుకోవాలని చెప్పినా పట్టించుకోలేదని, మోదీ విధానాలే చేనేతకు మరణశాసనంలా మారాయని మండిపడ్డారు. ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణకు, ఏ ఒక్క వర్గానికీ వీసమెత్తు పనికాలేదని మండిపడ్డారు.
‘ఉత్తగనే హిందూ, ముస్లిం అనగానే ఆగం కాకండి… దేవుడి పేరుతో రాజకీయం చేయగానే కింద మీద కావద్దు’ అని ప్రజలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ‘మాట్లాడితే దేవుడంటరు. ఎములాడ దేవుడికి ఏమన్న ఇచ్చారా అంటే ఏమీ లేదు. అల్లికి అల్లి.. సున్నకు సున్న. దేవుని పేరిట రాజకీయం చేసి నాలుగు ఓట్లు దొబ్బుకోవాలె. ప్రజలను ఆగం జెయ్యాలె. పోరగాండ్లను రెచ్చగొట్టాలె. అందుకే మిమ్మల్ని కోరుతున్నా.. దయచేసి, కూర్చున్న కాడ చర్చ పెట్టండి.. ఎనిమిదేండ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏమి చేసిందో? ఎనిమిదేండ్ల మోదీ ప్రభుత్వం దేశానికి, తెలంగాణకు ఏమిచేసిందో? రైతు, నేత, గీతన్నలు, ప్రతి కులం, మతం తెలంగాణలోని ప్రతిబిడ్డ చర్చపెట్టి, నిగ్గదీసి అడగాలె. తప్పు చేస్తే మమ్మల్ని కూడా ప్రశ్నించండి’ అని పిలుపునిచ్చారు.