mt_logo

తెలంగాణ ప్రభుత్వ వాణిజ్య విధానం అద్భుతం : ఫిస్కర్ సీఈఓ

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వాణిజ్య విధానాలు అద్భుతమని ఫిస్కర్‌ సీఈవో హెన్రిక్‌ ఫిస్కర్‌ కొనియాడారు. అమెరికాకు చెందిన ఈ విద్యుత్తు ఆధారిత వాహన తయారీ సంస్థ.. భారత్‌లో తమ ప్రధాన కేంద్రాన్ని హైదరాబాద్‌ లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫిస్కర్‌ సీఈవో హెన్రిక్‌ ఫిస్కర్‌… ఓ ప్రముఖ జాతీయ వాణిజ్య వార్తా వెబ్‌సైట్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో వ్యాపార నిర్వహణ సులభతరంగా ఉండేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీలను ఫిస్కర్‌ ప్రశంసించారు. తమ హైదరాబాద్‌ కేంద్రంలో దాదాపు 50 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరి సంఖ్య 500కు పెంచనున్నట్టు చెప్పారు. నగరంలో మరో నూతన ఆఫీస్‌ స్పేస్‌ కోసం కూడా చూస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన వివరించారు.

హైదరాబాద్‌లో మా సంస్థ ప్రధాన కేంద్రాన్ని నెలకొల్పడానికి ముందు బెంగళూరు వంటి పలు నగరాల్లోని పరిస్థితులనూ గమనించామని, ఎక్కడాలేని విధంగా హైదరాబాద్ లో అత్యంత ప్రతిభావంతుల్ని గుర్తించామన్నారు. అలాగే మెరుగైన రవాణా వసతులు ఉండటం మా సంస్థ ప్రగతికి అన్నివిధాలా బాగుంటుందని ఈ నగరాన్ని ఎంచుకుని, ఈ ఏప్రిల్‌లో ఫిస్కర్‌ ఇండియా ప్రధాన కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశామని ఫిస్కర్‌ తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వ సహకారం, మద్దతు గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఫిస్కర్‌ అన్నారు. ఇది మంచి వ్యాపార ప్రోత్సాహక ప్రభుత్వమని అభినందించారు. ముఖ్యంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌.. అమెరికా పర్యటన సందర్భంగా తమ సం స్థ ప్రధాన కార్యాలయానికి వచ్చినట్టు ఫిస్కర్‌ గుర్తుచేశారు. నాడు ఆయన చెప్పినట్టే హైదరాబాద్‌లో తమ కేంద్రానికి కావాల్సిన అన్ని అనుమతులు శరవేగంగా వచ్చేశాయన్నారు. భారత్‌లో తమ తొలి కారు వచ్చే జూలైలో వస్తుందని ఫిస్కర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *