రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చూపుతోందని, సోషల్ మీడియా వేదికగా కేంద్ర వైఖరిని ఎండగట్టారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు అని కేంద్రాన్ని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్, ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ-దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అర్హతలున్న జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్న రాష్ట్ర బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

