ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి లేదని, అంత ఆరాటం ఉంటే బీజేపీ ప్రభుత్వమే పార్లమెంట్ రద్దు చేసుకొని రావాలని… ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా మేము సిద్ధంగా ఉంటామని, గెలిచే సత్తా తమకు ఉందని స్పష్టం చేశారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్… మోడీని చెత్తబుట్టలో వేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే ఎన్నికలకు రావాలని.. మా సత్తా ఏంటో చూపిస్తామని కేటీఆర్ సవాల్ చేశారు. టైం ప్రకారం ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ ఇప్పటికే చెప్పారని.. కానీ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.
‘‘బీజేపీ ప్రభుత్వం వస్తే ఉచిత వైద్యం, విద్య ఇస్తామని చెప్తున్నారు కదా… ఇప్పుడు దేశంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది.. ఆలస్యం ఎందుకు.. రేపే ఉచిత వైద్యం, విద్య అమలు చేయమను.. తాము కూడా ఆ బిల్లుకు మద్దతిస్తాం. బీజేపీ నాయకులకు సన్మానం చేస్తాం. బండి సంజయ్‌కు తంబాకు, లవంగాలు పెట్టి సన్మానం చేస్తాము.’’ అని కేటీఆర్ అన్నారు.
గుజరాత్, కర్ణాటక, బీహార్, కేరళలో మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని, కానీ తెలంగాణలో మాత్రం పెంచనివ్వరని కేటీఆర్ ధ్వజమెత్తారు. మా ముస్లింలు ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో సామాజిక, ఆర్థిక పరిస్థితులను బట్టి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.కేంద్రం నిర్వహించే పరీక్షల్లో ఉర్దూ భాష పెడుతారు. కానీ తెలంగాణలో మాత్రం ఉర్దూ భాషలో పెడితే తప్పా? ఇంత చిల్లరతనం ఉండకూడదన్నారు. ‘‘మా పోటీ ఇతర రాష్ట్రాలతో కానే కాదు.. తెలంగాణ మోడల్‌ను దేశమంతా ప్రవేశపెడుతాం. గోల్ మాల్ గుజరాత్ మోడల్‌ను ఎండగడుతాం.. గోల్డెన్ తెలంగాణ మోడల్‌ను దేశం ముందు పెడుతాం. మా ముఖ్యమంత్రి ఈ దేశాన్ని జాగృతం చేస్తారు.’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.