తెలంగాణ పట్ల కేంద్రం తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నదని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్రం కోరిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా మంజూరుచేయకుండా ఉపేక్షిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం నుంచి ఏమీ సాధించలేని బీజేపీ నేతలు అనవసర అంశాలు ప్రస్తావిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘రాష్ట్రానికి అండగా మేము.. దేశానికి దండగ మీరు’ అని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా బీజేపీ నేతల విమర్శలను సోమవారం సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ తిప్పికొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఏ ఒక్క ప్రాజెక్టును ఆమోదించకపోవడమే కేంద్రానికి మనపట్ల ఉన్న ఉదాసీనతకు నిదర్శనమన్నారు. రాష్ట్రం కేంద్రానికి పంపించిన 19 ప్రతిపాదనల వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కేంద్రం పక్షపాత వైఖరి పలు రాష్ట్రాలను బాధిస్తున్నదని తెలిపారు. తాను కేంద్రం వైఖరి గురించి మాట్లాడితే… కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. సమతామూర్తి వద్ద కూడా రాజకీయాలేమిటని ప్రశ్నించారు. తెలంగాణకు మీరు ఏం సాధించారని బీజేపీ నేతలను నిలదీశారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ ఇవ్వకపోయినా.. దిగ్గజ ఐటీ కంపెనీలను తెచ్చామని, జాతీయ హోదా ఇవ్వకపోయినా కాళేశ్వరం నిర్మించుకొన్నామని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోయినా.. ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకొన్నామని గుర్తుచేశారు.
తెలంగాణకు ఏం తెచ్చారు? :
తెలంగాణలోని బీజేపీ నేతలు రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్‌చేశారు. విభజన హామీలను సైతం ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించి, కంటోన్మెంట్ ఆధీనంలోని భూములను అడిగినా ఇవ్వలేదన్నారు. పసుపు బోర్డుకోసం రైతులు మొత్తుకొంటుంటే పెడచెవిన పెట్టారని పేర్కొన్నారు. గిరిజన వర్సిటీ, నవోదయ స్కూళ్లు.. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రజలకు అవసరమైన ఏ ఒక్క ప్రాజెక్టునూ కేంద్రం మంజూరు చేయలేదని తెలిపారు. మెట్రో రైలుకు సహకరించలేదని, కొత్త రైల్వే లైన్ల మంజూరీలోనూ మొండిచెయ్యి చూ పారన్నారు. గాడ్సే ఆరాధకులకు మత సామరస్యం అర్థం కాదని, దేశాన్ని ఎనిమిదేండ్లపాటు పాలించిన తర్వాత కూడా ప్రజల్ని 80-20గా విభజించి చూడటం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రతిపాదనలన్నింటినీ ఆమోదించకపోవడమే కాకుండా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ర్టానికి ఒక్కటి కూడా తేకపోవడం వారి చేతకానితనానికి తార్కాణమని ఎద్దేవాచేశారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజక్టులకు జాతీయహోదా సహా 19 ప్రధాన అంశాలపై కేంద్ర సహకారం కోసం అనేక ప్రతిపాదనలు పంపినా ఫలితం లేదని, అయినా రాష్ట్ర బీజేపీ నేతలు వాస్తవాలను పక్కకుపెట్టి సంబంధంలేని విషయాలను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు.