Mission Telangana

పెట్రో భారాన్ని ఎందుకు తగ్గించరు ? : కేంద్రాన్ని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

తన అసమర్థ విధానాలతో దేశ ప్రజలను దోపిడీ చేస్తున్న కేంద్రం బీజేపీ ప్రభుత్వం.. ఇప్పటికైనా పెట్రో పన్నుభారం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి వరింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారక రామారావు డిమాండ్‌ చేశారు. ప్రపంచ మారెట్లో ముడి చమురు ధరలు వంద డాలర్ల కన్నా దిగువకు తగ్గినా.. కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. పెట్రో ధరల పెరుగుదలకు అంతర్జాతీయ ముడిచమురు ధరలు కారణమంటూ మోదీ ప్రభుత్వం చేస్తున్న వాదనలోని డొల్లతనం ఇప్పుడు మరోసారి బయటపడిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మంత్రి కేటీఆర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ బ్యారెల్‌ ముడి చమురు ధర భారీగా తగ్గుతూ వచ్చిందని, అయినా ఘనత వహించిన మోదీ పాలనలో దేశంలో పెట్రో రేట్లు మాత్రం పెరుగుతూ పోయాయని తెలిపారు. రేట్లు పెంచిన ప్రతిసారీ అంతర్జాతీయ ముడి చమురు ధరలను బూచీగా చూపడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. బ్యారెల్‌ ముడిచమురు ధర తగ్గితే ఆ ప్రయోజనం ఎకడ దేశ ప్రజలకు ఇవ్వాల్సి వస్తుందేమోనన్న కుటిల అలోచనతోనే మోదీ ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాలను, సెస్సులను భారీగా పెంచుతున్నదని ఆయన విమర్శించారు. ‘2014 నుంచి ఇప్పటి వరకు పెంచడమే తప్ప తగ్గించడం తెలియదన్నట్టుగా.. పెట్రో ధరలను మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పదులసార్లు పెంచింది. కార్పొరేట్ల పాదసేవ చేస్తూ, జాతి సంపదను అప్పనంగా వారికి కట్టబెడుతూ, దేశంలోని ఒక్కో వ్యవస్థను కబళిస్తూ మోదీ సర్కారు జనాలను పీక్కుతింటున్నది’ అని కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇప్పటివరకు పెట్రో పన్నులు, సెస్సుల రూపంలో రూ. 26 లక్షల కోట్ల రూపాయలకు పైగా జనం జేబుల నుంచి మోదీ ప్రభుత్వం దౌర్జన్యంగా దోచుకున్నదని కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఆ మొత్తాన్ని బ్యాంకుల నుంచి కార్పొరేట్‌ బడాబాబులు తీసుకున్న రుణాలను మాఫీ చేయడానికి వినియోగిస్తున్నదని పేర్కొన్నారు. మోదీ ప్రేమ కార్పొరేట్‌ కంపెనీలపైనే తప్ప.. కాయకష్టం చేసుకునే వారిపై కాదని తెలిపారు. పెట్రో రేట్ల పెరుగుదల గత ప్రభుత్వ వైఫల్యమే అని అధికారంలోకి రాకముందు గొంతు చించుకున్న నరేంద్ర మోదీ.. ఇప్పుడు ధరల పెరుగుదలను ఆపడంలో తాను ఘోరంగా విఫలమయ్యానని ఒప్పుకుంటారా..? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 2014లో మోదీ సర్కారు ఏర్పాటైనప్పుడు బ్యారెల్‌ ముడిచమురు ధర దాదాపుగా 110 డాలర్లుగా ఉండేది. 2015 జనవరి నాటికి అది 50 డాలర్లకు, 2016 జనవరిలో 27 డాలర్లకు పడిపోయింది. ఇక 2020లో కరోనా లాక్‌డౌన్‌ సమయంలో బ్యారెల్‌ ముడిచమురు ధర ఏకంగా 11 డాలర్లకు పతనమైంది. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం మాత్రం ఏనాడూ పెట్రో ధరలను ఆ మేరకు తగ్గించిన పాపాన పోలేదు. పైగా ఏటేటా పన్నులు పెంచుతూ పోతున్నది. కేంద్రసంస్థల గణాంకాల ప్రకారం అధికారంలోకి వచ్చిన తొలి మూడేండ్లు 2014 మే నుంచి 2017 సెప్టెంబరు మధ్యనే పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ 54 శాతం పెరిగితే, డీజిల్‌పై ఏకంగా 154 శాతం పెరిగింది’ అని కేటీఆర్‌ వివరించారు.

కేంద్రం పెంచిన ఎక్సైజ్‌ డ్యూటీ నుంచి రాష్ట్రాలకు వచ్చేదే చాలా తక్కువని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రాలు ఆర్థికంగా బలహీనపడాలన్న కుట్రతోనే మోదీసర్కారు పన్నుల రూపంలో కాకుండా సెస్సుల రూపంలోనే ఎక్కువగా పెట్రోల్‌ రేట్లను పెంచిందని వివరించారు. సెస్సుల రూపంలో ప్రజల నుంచి భారీగా వసూలు చేస్తూ తమ ఖజానా నింపుకొంటున్నదని, రాష్ట్రాలపై తప్పుడు ప్రచారాలకు దిగుతున్నదని విమర్శించారు. ‘సెస్సులు, సుంకాల పేరుతో మోదీ ప్రభుత్వం దోపిడీ చేస్తూనే.. అ నెపాన్ని రాష్ట్రాలపైకి నెడుతున్నది. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచీ ఇప్పటివరకు పెట్రోల్‌పై ఒక్క రూపాయి అదనపు పన్ను వేయని తెలంగాణ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలపై నిందలు మోపుతున్నారు. ఓ వైపు ధరలు, పన్నులు పెంచుతూ మరోవైపు పేదల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇది నయవంచనకు పరాకాష్ఠ’ అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. సెస్సులు కాకుండా విధించిన ఒక పెట్రో సుంకాలను కేంద్రం పూర్తిగా ఎత్తేస్తే.. ప్రతి లీటర్‌పై ప్రజలకు రూ.30 వరకు ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. అడ్డూ అదుపూ లేకుండా మోదీ సరారు పెంచిన పెట్రో రేట్లతో రవాణాఖర్చులు, నిత్యావసరాల ధరలు పెరిగి దేశ చరిత్రలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయని కేటీఆర్‌ మండిపడ్డారు. పేద, మధ్యతరగతి వర్గాల జీవన స్థితిగతులు పూర్తిగా దిగజారాయని కేటీఆర్‌ అవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం ముడి చమురు బ్యారల్‌ ధర 95 డాలర్లకు తగ్గినా.. ప్రజలపై కనికరంలేని ప్రధాని మోదీ పెట్రో ధరలు తగ్గించడం లేదని పేర్కొన్నారు. దుర్భరమైన ద్రవ్యోల్బణ పరిస్థితులు, కరోనా, లాక్‌డౌన్‌, కేంద్రప్రభుత్వ విఫల విధానాల ఫలితంగా అనేకమంది ఉపాధి కోల్పోతున్న నేపథ్యంలో కేంద్రం వెంటనే పెట్రోల్‌, డీజిల్‌పై ఉన్న అన్ని రకాల సెస్‌లను రద్దు వాటి ధరలను తగ్గించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

పెట్రో ధరలను పెంచి ప్రజల నుంచి భారీగా ఆదాయాన్ని గుంజిన మోదీ సర్కారు.. దాన్ని మరింత పెంచుకునేందుకు బరితెగించిందని కేటీఆర్‌ మండిపడ్డారు. 2020 వరకు పెట్రోల్‌, డీజిల్‌ పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని గరిష్ఠంగా పెంచుకోవడానికి వీలుగా.. 2020 మార్చిలో చట్ట సవరణ సైతం చేసిందని విమర్శించారు. ప్రజలపై భారం వేసేందుకు చట్టాన్ని సైతం సవరించిన ప్రజావ్యతిరేక ప్రభుత్వం ప్రధాని మోదీదని కేటీఆర్‌ ఆరోపించారు. కొవిడ్‌ మహమ్మారితో ఓ వైపు దేశ ప్రజలు ఆర్థికంగా చితికిపోయి ఉన్న సమయంలో కనీస కనికరం లేకుండా మోదీ సరారు ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచుకుంటూ పోయిందని తెలిపారు. ఒక అంచనా ప్రకారం 2020 నాటికే మోదీ సరారు ఒక ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలోనే సుమారు 14 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసిందని వెల్లడించారు. సెస్సులు, పన్నుల రూపంలో ఇప్పటిదాకా మెత్తం 26 లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రజల నుంచి గుంజిన దగాకోరు ప్రభుత్వం మోదీదని కేటీఆర్‌ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *