హెల్త్ కేర్ 3డీ ప్రింటింగ్ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే టీ హబ్‌లో 3డీ ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో మెడికల్ డివైజెస్, ఇంప్లాంట్స్‌లో 3డీ ప్రింటింగ్‌పై జరిగిన జాతీయ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో వివిధ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతలో తెలంగాణను అగ్రగామిగా నిలిపే లక్ష్యంలో భాగంగా 3డీ ప్రింటింగ్‌పై దృష్టి సారించామన్నారు. 3డీ ప్రింటింగ్ ద్వారా సర్జన్లు, రోగులకు వైద్య సేవలను మరింత మెరుగుపరిచే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఆర్థికంగా హెల్త్ కేర్ 3డీ ప్రింటింగ్ మార్కెట్ విలువ 2020లో 1.7 బిలియన్ డాలర్లుగా ఉందన్నారు. 2027 నాటికి ఇది 7.1 బిలియన్లకు చేరుతుందని అంచనా వేశారు. ఆర్థోపెడిక్, డెంటల్‌తో పాటు పలు విభాగాల రోగుల్లో ఇంప్లాంట్లకు డిమాండ్ పెరగడం ఈ రంగం అభివృద్ధికి ప్రధాన కారణం అని చెప్పారు. ప్రస్తుతం ఈ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు భారత్‌కు చక్కటి అవకాశముందన్నారు. యూఎస్, యూరోపియన్ మార్కెట్లలో ఇప్పటికే ఈ సాంకేతికత దూసుకుపోతుందన్నారు. ఉస్మానియాలో ఏర్పాటు కాబోతున్న నేషనల్ సెంటర్ ఫర్ అడిట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్‌తో ఈ రంగంలో దేశం పురోగతి సాధిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.