రాష్ట్రంలోని మున్సిపల్ అధికారులు, సిబ్బందిని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్‌లోని వెంగళ్రావు నగర్‌లో నిర్వహించిన పట్టణ ప్రగతి అవగాహన సదస్సులో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్ల కంటే మున్సిపల్ అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు కష్టపడుతున్నారని, వారిని అందరం గౌరవించాల్సిన అవసరం ఉందని, మున్సిపల్ జాబ్ థ్యాంక్ లెస్ జాబ్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడినపుడు 68 మున్సిపాలిటీలు ఉండగా, ఇప్పుడు కొత్తగా 74 మున్సిపాలిటీలు ఏర్పాటు కాగా… అన్ని మున్సిపాలిటీల్లో నిర్విరామంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది అందరూ కష్టపడి పని చేస్తున్నారన్నారు. మున్సిపల్ సిబ్బంది చేస్తున్నంత గొడ్డు చాకిరి రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ఇతర డిపార్ట్‌మెంట్ కూడా చేయడం లేదని అన్నారు. మున్సిపల్ సిబ్బంది ప్రతి రోజు ఊరుని శుభ్రంగా ఉంచినా ఎవరూ మిమ్మల్ని అభినందించరు కానీ, ఒక వారం రోజుల పాటు బంద్ పెడితే.. కౌన్సిలర్ నుంచి మంత్రి దాకా ఫోన్లు చేసి తిడుతారని, ఎందుకంటే ఈ జాబ్ థ్యాంక్ లెస్ జాబ్ అని కేటీఆర్ పేర్కొన్నారు. అనేక కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినా… మున్సిపల్ శాఖకు అదనపు సిబ్బందిని ఇవ్వలేదని, ఉన్నసిబ్బందితోనే పట్టణ ప్రగతి అమలు చేసి ఉరుకులు పరుగులు పెట్టించి పని చేయించామని, వారిని అభినందించాలని కౌన్సిలర్లకు, చైర్మన్లకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
తెలంగాణలో 46 శాతం పట్టణీకరణ పెరిగిందని కేటీఆర్ తెలిపారు. రాబోయే 5 నుంచి ఏడేండ్లలో మెజార్టీ ప్రజలు 51 శాతం పట్టణాల్లోనే నివసించబోతున్నారు. తెలంగాణలో 46 శాతం జనాభా పట్టణాల్లో ఉందన్నారు. భారతదేశ ఎకానమీ ముందుకు పోతుందంటే అందుకు పట్టణాలే ప్రధాన కారణమని కేటీఆర్ తెలిపారు. ఉపాధి, మెరుగైన వైద్య, విద్య కోసం పట్టణాలకు వస్తున్నారని… పిల్లల భవిష్యత్, జీవన ప్రమాణాలు పెరగాలని ప్రతి పేరెంట్ కోరుకుంటాడని, అందుకు పట్టణాలకు రావడం సహజం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పట్టణాల్లో జనాభా పెరిగి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటన్నింటిని అధిగమించాలంటే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. జనసాంద్రతకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణాలను మంచిగా అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు అందించాలని కేటీఆర్ సూచించారు.