వంద ఏళ్లకు పైగా చరిత్రను కలిగి ఉన్న విద్య కేంద్రం నిజాం కాలేజీ అభివృద్ధికి ఎన్ని నిధులైనా అందిస్తామని, కళాశాల నిర్వహణలో ఎక్కడా రాజీపడకుండా చూడాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిజాం కళాశాల ప్రాంగణంలో రూ.8 కోట్ల వ్యయంతో హెచ్‌ఎండీఏ నిర్మించిన బాలిక వసతి గృహాన్ని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో బుధవారం కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం భవనంలో తిరుగుతూ వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు… ‘నేను నిజాం కాలేజీలోనే చదువుకున్నా. ఇక్కడికొచ్చిన ప్రతిసారి ఎన్నో జ్ఞాపకాలు, సందర్భాలు గుర్తుకొస్తుంటాయి. పూర్వ విద్యార్థిగా నావంతు ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన కలిగింది. క్రితం సారి వచ్చినపుడు బాలికల హాస్టల్ అవసరం ఉందని ప్రిన్సిపాల్ అడగడంతో, 8 కోట్లతో అత్యాధునిక మౌలిక వసతులతో హాస్టల్ భవనం నిర్మించామని’ అన్నారు. ‘మన ఊరు – మనబడి’ కింద కార్యక్రమాన్ని గుర్తుచేస్తూ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి విన్నపం మేరకు మరో రూ.10 నుంచి రూ.15 కోట్లు ఖర్చు చేసైనా నిజాం కళాశాలను అద్భుతంగా అభివృద్ధి చేస్తాం. కళాశాల ప్రాంగణం ఎంతో విశాలంగా ఉంది. కొత్త భవనాలతోపాటు పాత భవనాలు ఉన్నాయి. ఆధునికంగా కనిపించాలంటే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.
రాష్ట్రంలో ఏడున్నరేళ్లుగా ఎంతోమంది ప్రభుత్వోద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని, మీరెంతో అదృష్టవంతులు. డిగ్రీ పట్టాలు పుచ్చుకొని బయటకొస్తున్న రోజే ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రకటనలు రావడం… మీ అదృష్టం అని తెలిపారు. ‘నేను నిజాం కాలేజీలో చదువుకునే రోజుల్లో కెరీర్‌పై స్పష్టత ఉండేది కాదు. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వాస్తవిక ప్రపంచం ఏమిటో తెలుస్తుంది. అయినా ఈ తరం విద్యార్థులకు భవిష్యత్తుపై స్పష్టత ఉంది. ఇక్కడున్న విద్యార్థులకు విజ్ఞప్తి ఏమంటే..డిగ్రీలు తీసుకున్న తర్వాత ఉద్యోగాల కోసం మాత్రమే ప్రయత్నం చేయకండి. చదివిన చదువుకు తగ్గట్టుగా, మీ కష్టానికి ఫలితంగా ఉద్యోగమైతే వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగమే కాదు. ప్రైవేటు రంగంలోనూ ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అద్భుత ఆవిష్కరణలు చేసే విద్యార్థులు ఉన్నారు. అలా చేస్తే మీరు ఇతరులకు ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదుగుతారు. భారత్‌కు చెందిన వారే ఇప్పుడు ప్రపంచంలోని టాప్ కంపెనీల సీఈవోలుగా ఉన్నారు. మైక్రోసాప్ట్,గూగుల్,ఐబీఎం..ఇలా ప్రపంచస్థాయి కంపెనీల సీఈవోలు మన భారతీయులే’ అని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అనంతరం ప్రయోగాత్మకంగా ‘మన ఊరు – మన బడి’ మొదలవనున్న మహబూబియా బాలికల పాఠశాలను సందర్శించి, పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ప్రభాకర్‌రావు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, నిజాం కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. భవన ప్రారంభోత్సవ తర్వాత గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ విద్యార్థులకు గోల్డ్‌మెడళ్లు, పట్టాలను ప్రదానం చేశారు.