mt_logo

ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారు ? : అమిత్‌షాకు లేఖ రాసిన మంత్రి కేటీఆర్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం తీరును ఎండగడుతూ… ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణపై బీజేపీకి వివక్ష అలానే ఉందని ఆరోపించారు. కేంద్రం కడుపునింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మానడం లేదని, ప్రతీసారి నేతలు వచ్చి స్పీచులు దంచి.. విషం చిమ్మి పత్తా లేకుండా పోవుడం కేంద్ర నాయకులకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ.. గుజరాత్‌కు మాత్రం ఇవ్వని హామీలను ఆగమేఘాల మీద అమలు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తూ… ఘాటు లేఖ రాశారు.

ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని కూడా ప్రశ్నించడం బీజేపీకే చెల్లించదన్నారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైందన్నారు. తెలంగాణ గడ్డపై అమిత్ షా అడుగుపెడుతున్న నేపథ్యంలో విభజనచట్టంలోని హామీలను తెలంగాణ సాక్షిగా కేంద్రం దృష్టికి తేవడంతో పాటు వాటి కోసం తెగేదాక కొట్లాడడం మా బాధ్యతని స్పష్టం చేశారు. అందుకే తెలంగాణ సమాజం ముక్తకంఠంతో నినదిస్తున్న అనేక అంశాలను అమిత్‌ షా దృష్టికి తెస్తున్నానన్నారు.

రాష్ట్రానికి చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అసలు విభజన చట్టంలోని ఒక్క హామీనైనా కేంద్రం నెరవేర్చిందా? రైల్వే ఫ్యాక్టరీ గుజరాత్‌లో ఎలా వస్తుంది? కాజీపేటలో ఎందుకు పెట్టరు? అని కేటీఆర్‌ సూటిగా ప్రశ్నించారు. నవోదయ, ఐఐఎం, ఐసర్‌ విద్యాలయాలు తెలంగాణకు ఎందుకు కేటాయించలేదని నిలదీశారు. ‘గుజరాత్‌లో ఓ మెడికల్ విద్యార్థికి అడ్మిషన్ సమయంలో అన్యాయం జరిగిందని బాధపడిన ప్రధాన మంత్రి మోదీ’ అన్న వార్తలు చూశామని, అర్హతగల విద్యార్థికి అన్యాయం జరిగితే ప్రధాని స్పందించడం బాగుందని, కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదని, ఫలితంగా లక్షలాది తెలంగాణ బిడ్డలు మెడిసిన్ చదువుకోలేకపోతున్నారు. మరి మా బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ప్రధానమంత్రి మోదీకి, మీకు ఎందుకు బాధ కలగడం లేదు ? అని మండిపడ్డారు.

బయ్యారం ఉక్కు పరిశ్రమ హామీకి ఎందుకు తుప్పుపట్టించారు ? హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి అడ్డుకునేందుకు ఐటీఐఆర్‌ రద్దు కుట్ర కాదా ? అని మండిపడ్డారు. ఐటీ రంగంలో అగ్రస్థానంలో తెలంగాణ ఉందని, అలాంటిది సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఎందుకు ఇవ్వడం లేదు లేదని ప్రశ్నించారు. పాలమూరు – రంగారెడ్డి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? సాగునీటి హక్కులు దక్కకుండా చేస్తున్న తాత్సారంపై ఏం చెప్తారు ? అని కేటీఆర్‌ నిలదీశారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీకి ఎందుకు సాయం అందించడం లేదు? ఢిపెన్స్‌ కారిడార్‌ ఎందుకు మంజూరు చేయలేదు? అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నిధులు కాకుండా ప్రత్యేకంగా రాష్ట్రానికి చేసిన సహాయం ఏంటో చెప్పాలి ? అని డిమాండ్‌ చేశారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ లాంటి విప్లవాత్మక ప్రాజెక్టులకు 24వేల కోట్ల గ్రాంట్‌ ఇవ్వాలంటూ నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిందని, ఇప్పటిదాకా పైసా విదల్చని మీ పక్షపాత వైఖరిపై ఏం చెప్తారు? అని ప్రశ్నించారు. స్కైవేల నిర్మాణం కోసం రక్షణశాఖ భూములు అడిగితే ఏడేళ్లుగా తొక్కిపెడుతూ నగర పౌరులను అవస్థలకు గురి చేస్తున్నది నిజం కాదా? అని నిలదీశారు.

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నదీ ప్రక్షాళనకు వేలకోట్లు కేటాయించుకుంటూ.. మా మూసీ ప్రక్షాళన, అభివృద్ధికి మూడు పైసలు కేటాయించనిది నిజం కాదా? అన్నారు. హైదరాబాద్‌ నగరంలో చరిత్రలో ఎన్నడూ ఎరగని వరదల్లో మునిగితే.. గుజరాత్‌కు వేలకోట్ల వరద సాయం అందించి.. హైదరాబాద్‌కు మొండిచేయి చూపించి నయాపైసా ఇవ్వకుండా ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని హైదరాబాద్‌కు వస్తున్నారు? ఇది మీకు సిగ్గుచేటు కాదా? అని ప్రశ్నించారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్క్‌ ఉన్న తెలంగాణ రాష్ట్ర టెక్స్‌టైల్‌ రంగానికి చేయూత ఇవ్వకుండా.. మెగా పవర్‌లూం క్లస్టర్‌ ఇవ్వకుండా శీతకన్ను వేసింది నిజం కాదా? అని నిలదీశారు. తెలంగాణ రైతులు తమ ధాన్యాన్ని పంజాబ్‌ మాదిరే కొనుగోలు చేయాలని, ఢిల్లీ వేదికగా కోరినా ఎందుకు కొనుగోలు చేయడం లేదు? మీ ఎంపీ బాండ్‌ పేపర్‌పై ప్రజలకు రాసిచ్చిన హామీని తుంగలో తొక్కి ఇప్పటికీ నిజామాబాద్‌ జిల్లా పసుపు రైతులకు ఇవ్వాల్సిన పసుపు బోర్డు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పగలరా? అని డిమాండ్‌ చేశారు.

దేశ ప్రజల నడ్డి విరిచేలా పెంచుతున్న పెట్రో ధరల పైన అసలు కారణమైన సెస్సులను రద్దు చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని మా సీఎం కేసీఆర్‌ చేసిన డిమాండ్ విషయంలో మీ వైఖరి స్పష్టం చేస్తారా? అని ప్రశ్నించారు. దేశ ప్రజానీకంపై మోపిన సెస్సుల భారాన్ని రద్దు చేసి పెట్రో ధరలను తగ్గిస్తారా? లేదో? తెలంగాణ గడ్డ మీద నుంచి స్పష్టం చేస్తారా? అని నిలదీశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ హైదరాబాద్‌లో పెట్టబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారనీ, కానీ దాన్ని సైతం గుజరాత్‌కు తీసుకెళ్లిన మీది వైఖరి, గుజరాత్ పక్షపాత వైఖరి కాదా? హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్‌కు ఒక్కపైసా సహాయం చేయకపోగా, పోటీగా గుజరాత్‌లో మరో సెంటర్‌ను పెట్టిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *