mt_logo

రైతు బిడ్డలు రాజ్యాంగ పదవుల్లో ఉండటం రాష్ట్ర అదృష్టం : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో మూడు అత్యున్నత పదవుల్లో రైతు బిడ్డలు ఉండడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. శాస‌నమండ‌లి చైర్మ‌న్‌గా రెండోసారి ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కౌన్సిల్‌లో కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రానికి గ‌ర్వ‌కార‌ణం ఏందంటే.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిల్ చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి… వీరంతా రైతు బిడ్డ‌లే కావ‌డం విశేషం. రైతు బిడ్డ‌లు అత్యున్న‌త‌మైన రాజ్యాంగ ప‌ద‌వుల్లో ఉండ‌టం ఈ రాష్ట్ర అదృష్టం. గుత్తా సుఖేందర్ రెడ్డిని ఉద్దేశించి… మీరు వార్డు మెంబ‌ర్ నుంచి మండ‌లి చైర్మ‌న్ వ‌ర‌కు ఎదిగారు. న‌ల్ల‌గొండ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచి చ‌రిత్ర సృష్టించారు. 1996లో కేసీఆర్, అప్ప‌టి తెలుగు దేశం ప్ర‌భుత్వంలో ర‌వాణా శాఖ మంత్రిగా ఉన్నారు. మీరు, కేసీఆర్ క‌లిసి.. అప్ప‌టి ఆదిలాబాద్ జిల్లా నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక ప్ర‌చారానికి వెళ్లారు. శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్టు చూసేందుకు మీరంతా వెళ్లారు. మీరు బాధ‌తో ఇక్క‌డ ప్రాజెక్టు ఎట్ల ఉన్న‌ద‌ని అడిగి బాధ‌ప‌డ్డారు. ఏదో ఒక స‌మ‌యం వ‌స్తది.. తెలంగాణ ఏర్ప‌డితే త‌ప్ప మ‌న రైతుల బాధ‌లు తీర‌వు అని కేసీఆర్ చెప్పారు. ఆనాటి నుంచే కేసీఆర్‌తో మీరు అనేక సంద‌ర్భాల్లో ప‌లు అభిప్రాయాల‌ను పంచుకున్నారు. 2008లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల‌ను రాజీనామా చేశారు. ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ని చేయాల‌ని కేసీఆర్ నాకు ఆదేశం ఇవ్వ‌డంతో అక్క‌డికి వెళ్లాను. సుఖేంద‌ర్ రెడ్డి గ‌ట్టి తెలంగాణ‌వాది ఆయ‌న ఆశీస్సులు కూడా తీసుకోవాల‌ని కొంద‌రు నేత‌లు నాకు సూచించారు. తాము కోరిన‌ట్లే తెలంగాణ‌వాదులు గెల‌వాల‌ని ఆలేరు అభ్య‌ర్థి న‌గేశ్‌కు సుఖేంద‌ర్ రెడ్డి నైతిక మ‌ద్ద‌తు ఇచ్చి స్థైర్యాన్ని నింపారు. న‌ల్ల‌గొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ స‌మ‌స్య ప‌రిష్కారం కొర‌కు మునుగోడు నియోజ‌క‌వర్గానికి స్పీక‌ర్ నాదేండ్ల మ‌నోహ‌ర్ నాడు తీసుకెళ్లారు. పార్ల‌మెంట్ స‌భ్యుడిగా మీరు చెప్పిన మాట ఏంటంటే.. ఈ స‌మ‌స్య శాశ్వ‌తంగా ప‌రిష్కారం పోవాలంటే కృష్ణా జ‌లాల‌ను సుర‌క్షితంగా ఇంటింటికీ అందించిన‌ప్పుడే పోతుంద‌ని చెప్పారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కంతో ఫ్లోరోసిస్ నుంచి విముక్తి పొందాం. మొట్ట‌మొద‌టి రైతు స‌మ‌న్వ‌య స‌మితి చైర్మ‌న్‌గా మీరు బాధ్య‌త‌లు స్వీక‌రించి స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించారని గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *