mt_logo

టీఎస్‌ఐపాస్‌ తో పెట్టుబడుల వెల్లువ : మంత్రి కేటీఆర్

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన టీఎస్‌ఐపాస్‌ (తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ప్రాజెక్ట్‌ ఆప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌) పాలసీ విజయవంతంగా పనిచేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. “యాన్‌ అప్‌డేట్‌ టు ఇండియన్‌ ఎకానమి స్ట్రాటజీ టు 2035’ పేరుతో హైదరాబాద్‌లో సోమవారం ఆస్ట్రేలియన్‌ కాన్సులేట్‌ నిర్వహించిన సమావేశానికి మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్‌ఐపాస్‌ ద్వారా గత ఎనిమిదేండ్లలో 19వేల కేసులను పరిష్కరించామని చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు సుమారు రూ.2.71లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని, 16 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించామని వెల్లడించారు. దక్షిణ భారత దేశంలోనే హైదరాబాద్‌ బెస్ట్‌ సిటీ అని, దేశంలో మరే నగరంలోనూ లేని పెట్టుబడుల అనుకూల వాతావరణం ఇక్కడ ఉందని చెప్పారు. క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌లో అన్ని నగరాల కంటే హైదరాబాద్‌ ముందున్నదని, గత ఐదేండ్లుగా మెర్సర్స్‌ నివేదిక ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ వస్తున్నదని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక యూఎస్‌ స్టూడెంట్‌ వీసాలు కలిగిన నగరంగా హైదరాబాద్‌ నిలిచిందని, యూకేతోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. అందుకే బెంగళూరుతోపాటు హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆస్ట్రేలియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ ప్రతినిధులకు కేటీఆర్‌ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *