సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, టీఆర్ఎస్ బహిరంగ సభ సక్సెస్ చూసి బాబుకు మతి భ్రమించిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, తెలంగాణ బాగు పడ్తుందనే చరిత్రను చంద్రబాబు నిషేధించాడని అన్నారు. ఏపీలో కలిసేనాటికే తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమని, ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే అది నిజమైపోదని, చంద్రబాబు మాటల్లో డొల్లతనం బయటపడుతోందని మంత్రి పేర్కొన్నారు.
చంద్రబాబు బతుకే పేపర్ మేనేజ్ మెంట్ అని, తమతో పోటీ పడాలనుకుంటే పనిలో పడాలని, తెలంగాణలో బాగా అభివృద్ధి జరుగుతుందని స్వయంగా ఆంధ్రాబ్యాంక్ సీఎండీ ప్రకటించారన్నారు. బాబు దత్తత పుణ్యమా అని మహబూబ్ నగర్ నుండి వలసలు పెరిగాయని, తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చిందని, రైతులు కరెంట్ కావాలని అడిగితే నగరం నడిబొడ్డున పిట్టలని కాల్చినట్లు కాల్చివేసిన సంఘటన ఇంకా తమ కళ్ళముందు మెదులుతూనే ఉందని వివరించారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వంచించిన చరిత్ర ప్రజలందరికీ తెలుసని, మభ్యపెడితే చరిత్ర దాగదని, చీమలు పెట్టిన పుట్టలో పాము చేరినట్లు ఎన్టీఆర్ పెట్టిన టీడీపీలో బాబు చేరాడని ఎద్దేవా చేశారు.