mt_logo

2018 కల్లా మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ- సీఎం కేసీఆర్

రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సచివాలయంలో కొద్దిసేపటి క్రితం సమీక్ష నిర్వహించారు. 2018 నాటికల్లా తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉంటుందని, వేసవి పంటలకు పగటిపూట 9 గంటల విద్యుత్ ను సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మించే విద్యుత్ కేంద్రానికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ గా పేరును ఖరారు చేశారు. త్వరలోనే పవర్ స్టేషన్ కు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 4,320 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉందని, వచ్చే మార్చికల్లా 3 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ లక్ష్యాలకు, ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ శాఖ పని చేస్తుందని, వచ్చే సంవత్సరం మార్చి నాటికి 7వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, 2016 నాటికి తెలంగాణ విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా, 2018 నాటికి విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారుతుందని సీఎం వివరించారు.

ఇదిలాఉండగా హైదరాబాద్ లో పేదల గృహనిర్మాణాలపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో నిరుపేదలందరికీ ఇళ్ళు నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, నిరుపేదల ఇండ్లంటే ఎక్కడో విసిరేసినట్లు దూరంగా ఉండొద్దని, వారి ఇళ్ళు నగరం మధ్యలోనే ఉండాలని అన్నారు. ధనవంతుల వినోదాలు, విలాసాలు, కాలక్షేపాల కోసం వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారని, నిలువ నీడలేని నిరుపేదలకు ఇళ్ళు కట్టించడానికి విలువైన స్థలాలు వినియోగిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఆ విధంగా ఆలోచించి పేదల ఇంటి నిర్మాణం కోసం స్థలాలు సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

నగరంలో ప్రభుత్వ కార్యాలయాలకు పదుల ఎకరాలు, యూనివర్సిటీలకు వేల ఎకరాలు, చిన్నపాటి విద్యాసంస్థలకు వందల ఎకరాలు, వివిధ క్లబ్బులకు పెద్ద మొత్తంలో భూములు కేటాయించారని, వాటిలో చాలా వరకు భూములు నిరుపయోగంగా ఉన్నాయని, ఆ భూములను పేదల ఇంటి నిర్మాణం కోసం కేటాయించాలని సూచించారు. హైదరాబాద్ లో సుమారు 2 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ళు లేవని, ఇళ్లులేని నిరుపేదలకు 2 వేల ఎకరాల్లో పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో బహుళ అంతస్థుల భవనాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తామని సీఎం పేర్కొన్నారు. వీలయితే బంజారా హిల్స్ లోనే పేదలకు ఇళ్ళు కట్టాలని నిర్ణయించినట్లు, రూ. లక్ష 15వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ళ నిర్మాణాలకు నిధుల కొరత సమస్య ఉండొద్దని అధికారులను ఆదేశించారు. ప్రతీ ఇంటికి మంచినీరు అందిస్తామని చెప్పినట్లే ప్రతీ నిరుపేదకు సొంతిల్లు కట్టించాలనే ఆశయంతో ప్రభుత్వం ఉందని సీఎం వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *