mt_logo

కాగజ్నగర్లో రూ.5 కోట్లతో 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వైద్య రంగం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం కాగజ్ నగర్ లో రూ.5 కోట్లతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు పడ్డాయని, అధునాతన వైద్య సదుపాయాలు ఏర్పడ్డాయని తెలిపారు. మంచిర్యాల, నిర్మల్,ఆసిఫాబాద్ జిల్లాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు మాత్రమే డయాలసిస్ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం తెలంగాణలో 102 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా త్వరలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు కేసీఆర్ కిట్లు, మాత శిశువుల్లో రక్తహీనత తగ్గించేందుకు ప్రత్యేకంగా కేసీఆర్‌ న్యూట్రిషన్ కిట్లను ఇస్తున్నామని అన్నారు. త్వరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 950 డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు కోవలక్ష్మి , ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ చాహత్ వాజ్‌పాయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *