mt_logo

ప్రతిరోజు పదివేల మందికి ఉచిత డయాలసిస్ : మంత్రి హరీష్ రావు 

దేశంలో సింగిల్‌ యూజ్‌ ఫిల్టర్‌ డయాలసిస్‌ సిస్టమ్‌ను ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో ఇది కార్పొరేట్‌ హాస్పిటళ్లకే పరిమితమైందన్నారు. హైదరాబాద్‌ నిమ్స్‌ దవాఖానలోని న్యూరో విభాగంలో రూ.2 కోట్లతో ఏర్పాటుచేసిన అత్యాధునిక వైద్య పరికరాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వైద్యులు నిత్య విద్యార్థులేనని చెప్పారు. కొత్తగా వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు.

ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ కింద ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా పేద ప్రజలకు సింగిల్‌ యూజ్‌ ఫిల్టర్‌ సిస్టం ద్వారా డయాలసిస్‌ అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు 10 వేల మందికి డయాలసిస్‌ చేస్తున్నామని వెల్లడించారు. డయాలసిస్‌ చేయించుకునేవారికి బస్‌పాస్‌, పెన్షన్లు, ఉచితంగా మందులు అందిస్తున్నామన్నారు. డయాలసిస్‌పై ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు వెచ్చిస్తున్నదని చెప్పారు.

పేదలకు కార్పొరేట్‌ తరహా వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ప్రతిఏటా ఆరోగ్య శ్రీ కింద రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. అత్యాధునిక వైద్య పరికరాల కోసం రూ.150 కోట్లు మంజూరు చేశామన్నారు. శుద్ధిచేసిన తాగునీరు అందిస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ప్రాథమిక దశలోనే గుర్తించి రోగాలు రాకుండా చూసుకోవాలన్నారు.

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు అత్యధికంగా నిమ్స్‌లో జరుగుతున్నాయన్నారు. నిమ్స్‌ను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. దవాఖానలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. వైద్య సిబ్బంది ఓనర్‌షిప్‌తో పనిచేయాలని, పేదలకు మంచి వైద్యం అందించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *