బుధవారం నుండి రైతుబంధు సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. నేడు సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ప్రారంభించిన అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… హైదరాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీలో నిర్మించినట్టు కోహిర్ లో రూ.5.60 కోట్లతో 88 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినట్టు తెలిపారు. అలాగే 50 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్టు, త్వరలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం రూ. 150 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు మంత్రి తెలియజేసారు. కాంగ్రెస్ హయాంలో ఇళ్ల నిర్మాణం జరగాలంటే లంచం ఇవ్వాల్సి వచ్చేదని, తెలంగాణ ఏర్పాటయ్యాక ఆ పరిస్థితి లేదని అన్నారు. గీతారెడ్డి మంత్రిగా ఉన్నపుడు జహీరాబాద్ ను నిర్లక్ష్యం చేశారని, తాగేందుకు మంచినీళ్లు కూడా ఉండేవి కావని మంత్రి హరీష్ రావు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి ఆపరేషన్లలో సంగారెడ్డి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ఇది సాధ్యం అయిందని అన్నారు. తొందరలోనే సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ప్రారంభించి, వాటిని గోదావరి జలాలతో నింపుతామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్నదాతలకు అండగా ఉంటుందని మంత్రి హరీష్ రావు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్యరావు, చేనేత కార్పోరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ రావు పాల్గొన్నారు.