హైదరాబాద్ లోని నిలోఫర్ ఆస్పత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్న పిల్లల్ల వార్డులను సందర్శించిన మంత్రి హరీశ్‌రావు.. పిల్లలకు వైద్యం ఎలా అందుతుంది.. ఏ వ్యాధి బారిన పడ్డారు.. సమయానికి భోజనం అందుతుందా.. అనే అంశాలను పిల్లల తల్లితండ్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… హైసీయా, నిర్మాణ్ సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ముందుకు రావడం మంచి విషయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తోందన్నారు. ప్రతి ఆసుపత్రికి సొంతంగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్య శాఖను అభివృద్ధి చేస్తామన్నారు. కరోనా మూడో వేవ్ అంచనాల నేపథ్యంలో ప్రత్యేకంగా చిన్నారుల కోసం 5000 పడకలు సిద్ధం చేశామన్నారు. దీనికోసం సీఎం 133 కోట్ల రూపాయలు విడుదల చేశారని హరీశ్ రావు తెలిపారు. త్వరలో 33 కోట్లతో నిలోఫర్‌లో మరో 800 పడకలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్న మంత్రి హరీష్ రావు, మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. నగరం నలువైపులా నాలుగు మెడికల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే మరో 8 వైద్య కాలేజీలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి.. ప్రభుత్వ వైద్యంపై డాక్టర్లు ప్రజలకు మరింత విశ్వాసం కల్పించాలని హరీశ్‌రావు సూచించారు.

