బుధవారం సీఎం కేసీఆర్ మల్లన్న సాగర్ జలాశయం ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… తెలంగాణకే తలమానికం అయిన మల్లన్న సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజుకు మరొక ప్రత్యేకత… ఈ ప్రాజెక్టును ఆపాలని వేసిన కేసులన్నీ నాలుగేళ్ల క్రితం ఇదే రోజు సుప్రీం కోర్టు కొట్టివేస్తూ, ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతిచ్చింది. ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేసినప్పటికీ, ఈ ప్రాజెక్టు కాదు, నీళ్లు రావు అన్నప్పటికీ… పట్టుదల ఉంటే కానిది ఏదీ ఉండదని అనుకున్న సమయం కంటే ముందుగానే సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు పూర్తి చేసి రుజువు చేశారన్నారు.
ఈ ప్రాంతంలో రిజర్వాయర్ వస్తే మొత్తం తెలంగాణ బాగుపడుతుందని ఈ స్థలాన్ని సీఎం కేసీఆర్ ఎంపిక చేశారని, కరువు కాటకాలు దూరం చేయవచ్చని, కొన్ని వేల గంటలు ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లతో చర్చించి సీఎం కేసీఆర్ దీనికి డిజైన్ చేశారని తెలియజేశారు. గతంలో గుక్కెడు తాగు నీళ్లు లేక, సాగునీరు లేక వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, అంబలికేంద్రాలు, గంజికేంద్రాలకు, కరువు కాటకాలకు నిలయంగా ఉండేవని, అలాంటి ఈ ప్రాంతానికి గోదారమ్మను తీసుకువచ్చి సస్యశ్యామలం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. నదిలేని చోట రిజర్వాయర్ కట్టడమే కాదు, ప్రజల అవసరాలను, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వందేళ్ల భవిష్యత్తు ఆలోచించి ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్ డిజైన్ చేసి పూర్తి చేశారన్నారు. ఎక్కడైనా నదికి అడ్డగా కడుతారని, కాని నది లేకపోయినా దేశంలోనే అతిపెద్ద రిజర్వాయర్‌ను ఇక్కడ నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు.
సమైక్య పాలనలో ఈ ప్రాంతం వానాకాలం కూడా ఎండకాలం లెక్కనే ఉండేదని, కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏ కాలం చూసినా వానాకాలం లెక్కనే కనిపించే మార్పు వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. మండుటెండల్లో సైతం రాష్ట్రంలో ఏ మూలకు పోయినా చెరువులు మత్తళ్లు దూకుతున్నయని,, చెక్‌డ్యాంలు అలుగు పారుతున్నయని, ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా మారిందని, ఇదంతా తెలంగాణ రావడం వల్లనే… తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే సాధ్యమైందని వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటేనే జీవితం ధన్యమైనంత గొప్ప అనుభూతి కలుగుతోందని, పంపుల్లో నుంచి పరవళ్లు తొక్కుతున్న గోదావరి నీళ్లను చూస్తే జన్మధన్యమైనంత సంతోషం కలిగిందని, ఇంత అద్బుతమైన కార్యక్రమం ఈరోజు సిద్ధిపేటలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పది జిల్లాలకు మల్లన్న సాగర్ ఒక వరమని, పది జిల్లాలకు సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చే అద్భుతమైన రిజర్వాయర్ అన్నారు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టును అందించినందుకు పది జిల్లాల ప్రజల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కు శిరస్సు వంచి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాని మంత్రి హరీష్ రావు అన్నారు.