mt_logo

మల్లన్న సాగర్… తెలంగాణ జల హృదయ సాగరం : సీఎం కేసీఆర్

మ‌ల్ల‌న్న సాగ‌ర్ కేవలం రిజర్వాయర్ మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల జ‌ల‌ హృద‌యం సాగ‌రం అని అభివర్ణించారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. బుధవారం మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్, అనంతరం ఏర్పాటు చేసిన స‌భ‌లో మాట్లాడారు. నూత‌న తెలంగాణ రాష్ట్రంలో నిర్మించ‌బ‌డ్డ అతి భారీ జ‌లాశ‌యం మల్ల‌న్న సాగ‌ర్‌ను ప్రారంభించుకోవ‌డం సంతోషకరమని,‘‘మ‌నం క‌ల‌లు క‌న్న తెలంగాణ రాష్ట్రంతో పాటు స‌స్య‌శ్యామ‌ల తెలంగాణ‌ను చూస్తున్నామన్నారు. ఈ మ‌హాయజ్ఞంలో 58 వేల మంది కార్మికులు పని చేశారని, వారందరికి ధ‌న్య‌వాదాలు తెలియజేశారు. ఇంజినీర్లు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందినప్పటికీ ఎండనకా, వాననక, రాత్రింబవళ్లు ఈ ప్రాజెక్టు కోసం ప‌ని చేశారని, వారందరికీ సీఎం కేసీఆర్ సెల్యూట్ అన్నారు. మంత్రి హ‌రీశ్‌రావు సేవ‌లు కూడా కాళేశ్వ‌రం ప్రాజెక్టులో ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ స‌మ‌యంలో కొందరు దుర్మార్గులు కోర్టుల్లో దాదాపు 600కు పైగా కేసులు వేశారని, రాష్ట్ర చీఫ్ జ‌స్టిస్‌కు ఫోన్ చేసి.. ఇది తెలంగాణ జీవ‌నాడి.. ఉన్న‌తంగా ఆలోచించి ఈ ప్రాజెక్టును కాపాడాల‌ని కోరగా… ఆ త‌ర్వాత ఈ ప్రాజెక్టుపై స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారన్నారు. భ‌యంక‌ర‌మైన క‌రువు నేల‌లో ప్ర‌జ‌లకు న్యాయం చేసేందుకు పోరాడమన్నారు. గోదావ‌రి నీళ్లు తెచ్చి కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న పాదాల‌ను క‌డుగుతామ‌ని చెప్పామని, చెప్పిన విధంగా గోదావ‌రి జ‌లాల‌తో మల్లన్నకు అభిషేకం చేయ‌బోతున్నామని అన్నారు. ఎంతో మనసు పెట్టి, అవినీతిరహితంగా ఈ ప్రాజెక్టు కోసం ప‌ని చేశామని, ఇది ఒక మ‌ల్ల‌న్న సాగ‌ర్ మాత్రమే కాదని… తెలంగాణ జ‌న హృద‌యం సాగ‌రం, తెలంగాణ మొత్తాన్ని గోదావరి జలాలతో అభిషేకించే సాగరమని వెల్లడించారు. సింగూరు ప్రాజెక్టును త‌ల‌ద‌న్నేలా ఇంజనీర్లు ఈ ప్రాజెక్టును నిర్మించారని కొనియాడారు. సిద్దిపేట‌కే కాకుండా హైద‌రాబాద్ న‌గ‌రానికి శాశ్వ‌తంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు అని, 20 ల‌క్ష‌ల ఎక‌రాల‌ను త‌న క‌డుపులో పెట్టుకుని కాపాడుకునే ప్రాజెక్టు మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *