mt_logo

అన్ని జిల్లాల్లో బస్తీ దవాఖానాలు త్వరగా ప్రారంభించండి : కలెక్టర్లకు మంత్రి హరీష్ రావు ఆదేశం

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బస్తీ దవాఖానలను త్వరగా ప్రారంభించాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. అవసరం అయితే కలెక్టర్లతో పాటు మున్సిపల్‌ కమిషనర్ల సహకారం తీసుకోవాలని స్పష్టం చేశారు. గురువారం పీహెచ్‌సీల పనితీరుపై జిల్లాల వైద్యాధికారులు, ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు, మెడికల్‌ ఆఫీసర్లు, సూపర్‌ వైజర్లతో మంత్రి హరీష్ రావు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌సీడీ స్క్రీనింగ్‌, ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో సీ- సెక్షన్ల రేటు, ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్, గర్భిణులకు అందుతున్న ఇతర సేవలు, ఓపీ, టీబీ, టీ డయాగ్నొస్టిక్, ఐహెచ్ఐపీ, తదితర వైద్య సేవలపై జిల్లాలు, పీహెచ్‌సీల వారీగా సమీక్ష నిర్వహిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గత నెలలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వివిధ జిల్లాల్లో పురోగతిని సాధించాయన్నారు. ఆ జిల్లాలకు, కృషి చేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలనీ, సీఎం కేసీఆర్‌ ఆరోగ్య శాఖ‌కు గ‌తేడాదితో పోల్చితే దాదాపు రెట్టింపు నిధులు కేటాయించారన్నారు. నూత‌నోత్సాహంతో ప‌ని చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, పీహెచ్‌సీ స్థాయికి ఆరోగ్యశ్రీ సేవ‌ల‌ను విస్తరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయనీ, దీనికి అనుగుణంగా అన్ని పీహెచ్‌సీలు, వైద్య సిబ్బందికి అవసరమైన శిక్షణ పూర్తి చేయాలంటూ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు ఆదేశాలిచ్చారు. సాధారణ ప్రసవాలు పెంచాల‌నే ల‌క్ష్యంలో భాగంగా ప్రభుత్వ వైద్యుల‌కు, నర్సులకు ఇన్సెంటివ్ ఇవ్వబోతున్నామన్నారు. తప్పకుండా నాలుగు ఏఎన్‌సీ చెక‌ప్స్ నిర్వహించడంతో మాతా, శిశు మ‌ర‌ణాలు త‌గ్గించ‌డం సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అయ్యేలా చూడాలనీ, ముఖ్యంగా సీ సెక్షన్లు తగ్గించి, సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ల సహకారంతో సమావేశం ఏర్పాటు చేసి.. సీ సెక్షన్ల కోసం ముహూర్తాలు పెట్టోవద్దని కోరండన్నారు. ఇదే విధంగా ప్రభుత్వ గైనకాలజిస్టులతో పాటు ప్రైవేటు గైనకాలజిస్టులతో సమావేశం నిర్వహించాలన్నారు.

పీహెచ్‌సీల్లో అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. మందులు లేవు అనే ప‌రిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దనీ, మందులు ఇవ్వడంతో ప్రజలు మందులు వేసుకుంటున్నారా? లేదా? చూడాలన్నారు. ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు విధుల్లో ఉంటూ వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. 24 గంట‌లు న‌డిచే పీహెచ్‌సీలు అత్యవసర సేవ‌ల‌ను అన్ని వేళ‌ల్లో అందించాలనీ, డీఎంహెచ్‌వోలు ఆకస్మిక తనిఖీలు చేసి ప‌నితీరును ప‌రిశీలించాలన్నారు. ప్రతి పీహెచ్‌సీని సందర్శించాలని, జిల్లా క్యాలెండర్ రూపొందించుకొని పని చేయాలన్నారు. సూపర్ వైజర్లు వారానికి 3,4 రోజులు ఫీల్డ్ చేయాలని, ఆరోగ్య వివరాలను ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాంలో ఎప్పటికప్పుడు వివ‌రాలు అప్‌లోడ్ చేయాలని, ఎన్సీడీ స్క్రీనింగ్ పక్కాగా చేస్తూ, మందులు అందే విధంగా చూడాలన్నారు. టీ డ‌యాగ్నోస్టిక్ సేవలు వినియోగించుకోవాలని, రోగాలు ముందే గుర్తించడంతో ముదరకుండా చేయడం, తద్వారా ప్రజల ఆరోగ్యాలను కాపాడడం సాధ్యం అవుతుందన్నారు. ఈ క్రమంలో పీహెచ్‌సీలదే కీలకపాత్ర అనీ, కరోనా వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలన్నారు. అన్ని కేటగిరీల్లో వంద శాతం పూర్తి కావాలన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *