mt_logo

అంతర్జాతీయ తల్లిపాల దినోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

మొదటి గంట తల్లి పాలు బిడ్డకు పట్టిస్తే అది మొదటి టీకాతో సమానం అవుతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల దినోత్సవానికి గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన తల్లిపాల ప్రాముఖ్యత అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు, తల్లికి ఇద్దరికీ మంచిదని, ముఖ్యంగా బిడ్డ రోగనిరోధక శక్తి పెంచి ఆరోగ్యంగా ఉంచుతుందని పేర్కొన్నారు. సమాజంలో..తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అన్నారు. ‘Step Up For Breastfeeding: Educate and Support’ అనే నినాదంతో ఈ వారం పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తల్లులు పాలు పట్టలేని నవజాత శిశువులకు, తల్లులు మరణించిన శిశువులకు, అనారోగ్యంతో ఉన్న లేదా తగినంత పాలు అందని శిశువులకు.. లేదా తల్లి పాలను తీసుకోలేని శిశువులకు పాలు అందించాలనే ఉద్దేశంతో మదర్ మిల్క్ బ్యాంకులను ప్రారంభించామన్నారు. హైదరాబాద్‌ నీలోఫర్‌ పిల్లల దవాఖానలో మొట్ట మొదటగా ఏర్పాటు చేశాం. ఇది విజయవంతం కావడంతో వరంగల్‌, ఖమ్మంలోనూ మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యునిసెఫ్ సంయుక్తంగా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తున్నందున ఈ వారం రోజులు తల్లిపాల పై ప్రజల్లో అవగాహన పెంచేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో 500 మంది తల్లులతో పాటు ప్రజలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించి ‘బుక్ ఆఫ్ ఇండియా’లో రికార్డు నెలకొల్పామన్నారు. ఆరోగ్య సమాజాన్ని నిర్మించడంలో ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్ వాడీలది కీలక పాత్ర అని మంత్రి హరీష్ రావు కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *