రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న రామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్ ప్రధాన వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. రామయ్యకు అన్నివిధాలుగా అండగా ఉంటామని ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి హరీశ్ హామీ ఇచ్చారు. బుధవారం ఉదయం వనజీవి రామయ్య.. ఖమ్మం జిల్లాలోని పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా మరో బైక్ వచ్చి ఆయనను ఢీకొట్టింది. దీంతో ఆయన కాలికి గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.