mt_logo

ములుగులో ప్రయోగాత్మక హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

ప్రయోగాత్మక హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును శనివారం ఉదయం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ములుగు జిల్లాలో ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య సూచిలను రూపొందించి, వాటిని భద్రపరిచి, ప్రజల అనారోగ్య సమస్యలను అత్యంత వేగంగా, సురక్షితంగా పరిష్కరించేందుకు, అత్యవసర సమయంలో ప్రాణాపాయ పరిస్థితిని నివారించేందుకు ఉద్దేశ్యించిన పథకమే హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… అత్యంత ప్రతిష్టాత్మక హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్న ములుగు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియ జేశారు. ప్రపంచంలో యూరప్ లో తప్పా ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం మీద పెట్టిన శ్రద్ధ ఇదని తెలిపారు. జిల్లాలో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు సేకరించే పని 40 రోజుల్లో వైద్య సిబ్బంది పూర్తి చేసి, ప్రతి ఒక్కరికి డిజిటల్ కార్డులు ఇస్తారని, దానిని బట్టి భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తె వైద్యం అందించడానికి సులభం అవుతుందని అన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క… ఈ జిల్లాను అన్ని జిల్లాలతో సమానంగా చూడాలని అడిగారని, కానీ మేము ఇంకా ఎక్కువ శ్రద్ధతో ములుగు జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాలో 42 కోట్లతో జిల్లా ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని, 60 లక్షలతో రేడియాలజీ లాబ్ ప్రారంభించామని, ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్నన్ని వసతులు ములుగు జిల్లాలో ఉన్నాయని పేర్కొన్నారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, మిషన్ భగీరథ వంటివి దేశానికి ఆదర్శంగా ఉన్నాయని, ఇప్పుడు కొత్తగా ఈ హెల్త్ ప్రొఫైల్ కూడా దేశానికి ఆదర్శం అవుతుందని మంత్రి తెలియజేశారు. గిరిజన విశ్వ విద్యాలయం కోసం ఏడేండ్ల నుండి నుంచి కేంద్రం డబ్బులు ఇవ్వలేదు. గిరిజన విశ్వ విద్యాలయం లో 7.5 శాతం రిజర్వేషన్లు ఇస్తారట. అప్పుడు ప్రత్యేక యూనివర్సిటీ ఎందుకు? ఇదెక్కడి నీతి? అలాంటప్పుడు దీనికి ఆ పేరు ఎందుకు? అని హరీష్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎంపీ కవిత ఇక్కడ పేదలకు మేలు జరిగే సియా మిషన్ కావాలని అడిగారని, వారంలో దానిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ములుగు జిల్లాకు మెడికల్ కాలేజీ శుభవార్తను త్వరలో సీఎం కేసీఆర్ ద్వారా వింటారని వెల్లడించారు. కొత్త 250 పడకల హాస్పిటల్ పాత 100 పడకలు కల్పి 350 పడకల హాస్పిటల్ జిల్లాలో అందుబాటులోకి రానుందని వివరించారు. దేశంలో మొట్టమొదటి గిరిజన జిల్లా ఈ హెల్త్ ప్రొఫైల్ ఉన్నదిగా ములుగు గుర్తింపు పొందుతోంది. ఇందులో నేను భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని, ఈ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం అనుకున్న సమయంలో అనుకున్నట్లు పూర్తి అయ్యేందుకు స్థానిక మంత్రి సత్యవతి రాథోడ్, ప్రజా ప్రతినిధులు సమయం కేటాయించి పర్యవేక్షించాలి అని మంత్రి హరీష్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కవిత, ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితర ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *