mt_logo

జూరాల ప్రాజెక్టు పరిహారంలో అవినీతిపై మంత్రి హరీష్ ఫైర్!

ఆ షెడ్డుకు రూ.1.5 కోట్లు-జూరాల పరిహారంలో అవినీతి వరద శీర్షికన సోమవారం ఒక పత్రికలో కథనం ప్రచురితమైన నేపథ్యంలో భారీ నీటిపారుదల శాఖామంత్రి టీ హరీష్ రావు వెంటనే స్పందించారు. సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించి రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్లతో పాటు అటవీశాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి విచారణ జరపాలని ఆదేశించారు. అంతేకాకుండా పూర్తి వాస్తవాలతో 15 రోజుల్లో నివేదిక అందించాలని సహాయ పునరావాస కమిషనర్ మాణిక్ రాజ్ ను మంత్రి ఆదేశించారు. విచారణ కోసం సీనియర్ ఇంజినీర్లు, అటవీ అధికారులను నియమించాల్సిందిగా ఆర్అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్, అటవీ శాఖ పీసీసీఎఫ్ లను మంత్రి కోరారు.

సాగునీటి ప్రాజెక్టుల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ అవినీతిని సహించేదిలేదని, నాగర్ దొడ్డి గ్రామంలో ఇళ్ళకు వాస్తవ అంచనా విలువతోనే పరిహారం చెల్లిస్తామని హరీష్ అన్నారు. అయితే నాగర్ దొడ్డి గ్రామంలోనే కాకుండా ఇప్పటికే పరిహారం చెల్లించిన గ్రామాల్లోనూ భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేసినట్లు, వాస్తవ విలువ కంటే భారీగా పెంచిన పరిహారాన్ని రెవెన్యూ, నీటిపారుదల అధికారులు, రాజకీయనేతలు వాటాలుగా పంచుకుని కొంత మొత్తాన్ని లబ్ధిదారుడికి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. కింది స్థాయి నుండి ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తెలిసే ఈ అవినీతి జరిగినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *