ఫార్చూన్ పత్రిక సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ఫార్చూన్ 500 నెక్స్ట్ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో కలిసి పది అభివృద్ధి చెందుతున్న కంపెనీలకు కేటీఆర్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 500 కంపెనీల్లో హైదరాబాద్ కేంద్రంగా ఉన్నవి కూడా ఉన్నాయని, మరిన్ని కంపెనీలు కూడా అందులో స్థానం సంపాదించుకుంటాయయని అన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నెక్స్ట్ 500 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామమని, దేశంలోనే ఆకర్షణీయమైన పారిశ్రామిక పాలసీ తెచ్చిన ఘనత తమదేనని కేటీఆర్ అన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో ద్వారా అన్ని రకాల అనుమతులు ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టీఎస్-ఐపాస్ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అతి తక్కువ కాలంలోనే గూగుల్, అమెజాన్ డాట్ కామ్ వంటి 50 సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో కొత్త యూనిట్లను ప్రారంభించాయని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోని పారిశ్రామిక ఆదాయంలో 45% చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుండే వస్తున్నాయని, ఈ తరహా కంపెనీలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యుత్తమ పారిశ్రామిక పాలసీని రూపొందించారని చెప్పారు. కేంద్రంలో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారి ఢిల్లీకి విమానంలో వస్తున్నప్పుడు పక్కనే కూర్చున్నారని, రాష్ట్రంలో అమలు చేస్తున్న పాలసీ ప్రతిని పంపాలని కోరడంతోపాటు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్ఫూర్తితో పారిశ్రామిక పాలసీని రూపొందించడానికి ఉపయోగపడుతుందని అన్నారని చెప్పారు. అనేక పరిశ్రమలు తెలంగాణ వైపు చూస్తున్నట్లు స్వయంగా ఆ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారని కేటీఆర్ తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా విద్యుత్ కొరతతో వ్యవసాయం, పరిశ్రమలు, గృహాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేసవిలో సైతం నిమిషం కూడా విద్యుత్ కొరత లేని పరిస్థితిని కల్పించామని అన్నారు. దేశంలోనే అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని, ఇక్కడ ఒక్కో యూనిట్ కేవలం రూ. 5.17 కే ఉత్పత్తి అవుతున్నదని కేటీఆర్ వివరించారు. ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్ కార్పొరేట్ నినాదాలతో నూతన కంపెనీలను ఆహ్వానిస్తున్నామని, ఇటీవలే అమెజాన్ డాట్ కాం ఆన్ లైన్ పోర్టల్ లో ఇప్పటివరకు మార్కెటింగ్ అవకాశాలు లేని పోచంపల్లి ఉత్పత్తులు, హస్తకళలు, నిర్మల్ పెయింటింగ్స్ లాంటి అనేక ఉత్పత్తులకు అవకాశం కల్పించామని, తాజాగా ఫేస్ బుక్ ద్వారా కూడా ఇలాంటి అవకాశాలకు విస్తృత ప్రచారం కల్పించనున్నామని మంత్రి చెప్పారు.
అనంతరం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నంతవరకు తీవ్రమైన కరెంట్ కొరతను అనుభవించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అతి తక్కువ రోజుల్లోనే వేసవిలో సైతం విద్యుత్ కోతలు లేని పరిస్థితిని కల్పించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును ప్రశంసించారు. విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పటికీ పరిశ్రమలు, వ్యవసాయం, గృహాలకు ఒక్క నిమిషం కూడా కరెంట్ కోతలు లేకుండా ప్రణాళిక రచించడం, అమలు చేయడం మామూలు విషయం కాదని మంత్రి కేటీఆర్ తో అన్నారు. విద్యుత్ ఉత్పత్తి రంగంలో అనేక కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు దేశంలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు.