mt_logo

ఒక మంచి పుస్తకం సమాజాన్ని మారుస్తుంది : మంత్రి గంగుల కమలాకర్

ఒక మంచి పుస్తకం సమాజాన్ని మారుస్తుంది అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. జ్ఞాన సముపార్జనకు పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని, పుస్తకాలు చదవడం వల్లనే ఎందరో గొప్ప వ్యక్తులుగా మారారని తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బుక్ ఫేర్, తెలంగాణ బుక్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని జ్యోతిరావు పూలే పార్క్ లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… కవులు, కళాకారుల ఖిల్లా కరీంనగర్ జిల్లా అని, పుస్తకాలకు జీవం పోయాల్సిన అవసరం, బాధ్యత కవుల మీద ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుస్తక ప్రేమికుడని, వేల పుస్తకాలను చదవడం వల్లనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడని అన్నారు. జిల్లాకు చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుస్తకాలు చదవడంతో పాటు అనేక పుస్తకాలు రాసారని ఆర్థికవేత్తగా అంతర్జాతీయంగా పేరు గడించారని తెలిపారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి గొప్ప కవిగా గుర్తింపు తెచ్చుకున్నారని, పద్మ విభూషణ్ శ్రీభాష్యం విజయసారథి సంస్కృత పండితుడిగా, నలిమెల భాస్కర్ బహు భాషావేత్తగా గుర్తింపు పొందారని అన్నారు. పిల్లలు పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు, గురుకుల పాఠశాలలకు విజ్ఞానం పెంపొందించే పుస్తకాలను పంపిణీ చేస్తామని మంత్రి అన్నారు. పుస్తక ప్రదర్శనలో 50 స్టాళ్లలో ఏర్పాటుచేసిన 20 వేల పుస్తకాలను విద్యార్థులు, మహిళలు, ప్రజలు తిలకించి తమకు నచ్చిన ఏదైనా ఒక పుస్తకం కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు.

బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ… ఇంట్లో పుస్తకాలు ఉంటే ఇంటికి వెలుగు వస్తుందని అన్నారు. పిల్లలకు పుస్తకాలు కొనిచ్చి చదవడం అలవాటు చేయాలని సూచించారు. దీనివల్ల పిల్లలు విజ్ఞానం పెంపొందించు- కుంటారని తెలిపారు. పుస్తకాలు చదవడం వల్ల మంచే జరుగుతుంది కానీ నష్టం జరగదని తెలిపారు. బాలికలను ఉన్నతంగా చదివించాలని, విజ్ఞానంతో కూడిన సమాజం ఆరోగ్యవంతంగా మారుతుందని అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ… అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో భాగంగా వారం రోజుల పాటు మహిళా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పుస్తకప్రియుడని, ఆయన ప్రోత్సాహం వల్లనే కరీంనగర్ లో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారని తెలిపారు. చదువుకుంటేనే పేదరికం నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని, చదువు వల్లనే గొప్ప స్థాయికి చేరుకోవచ్చునని అన్నారు. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం అలవడుతుందని, సంస్కృతి పెంపొందుతుందని అన్నారు. ఈనెల 4వ తేదీన సాహిత్య అకాడమీ పక్షాన అన్ని పాఠశాలల్లో మన ఊరు -మన చెట్లు అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన లో భాగంగా మహిళల కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి జరిగే మహిళల కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం సాహితీ కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని, తెలంగాణ వంటకాల స్టాల్స్ కూడా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *