mt_logo

పట్టణ పేదలను పట్టించుకోండి : కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగానే పట్టణాల్లో కూడా ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ విషయాన్ని రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పట్టణీకరణ రోజురోజుకు గణనీయంగా పెరుగుతన్న నేపథ్యంలో పట్టణాల్లో కూడా ఉపాధి హామీ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా వెంటనే కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజల జీవన స్థితిగతులు, వాటిలో సానుకూల మార్పుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపైన సవివరమైన సూచనలు చేస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు గురువారం మంత్రి కేటీఆర్ ఒక లేఖ రాశారు. పట్టణాల్లో పేదరికం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వారికి ఉపాధి హామి పథకం కింద పని కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని లేఖలో ఆయన ప్రస్తావించారు. పట్టణీకరణ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిణామం అని, ఇందుకు భారతదేశం ఏ మాత్రం మినహాయింపు కాదన్నారు. మెరుగైన ఉపాధి జీవన అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణాల వైపు తరలివస్తున్న నేపథ్యంలో పట్టణాల్లోని మౌలిక వసతులపైన తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుందన్నారు. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 31 శాతం జనాభా పట్టణాల్లో నివాసం ఉంటోందన్నారు. 2030 నాటికి దేశంలోని 40 శాతానికి పైగా జనాభా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండబోతుందన్నారు. తెలంగాణ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఇది 50 శాతాన్ని దాటే అవకాశం ఉన్నదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పట్టణ పేదరికంపైన దేశంలోని అన్ని ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. పట్టణ పేదలకు అవసరమైన గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం ,విద్య, సామాజిక భద్రత ,జీవనోపాదుల వంటి అంశాల పైన ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ పేదలు అత్యధిక శాతం అసంఘటిత రంగంలో కార్మికులుగా, చిరు వ్యాపారులుగా, కూలీలుగా పని చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఒక్కరోజు ఉపాధి దొరకక ఉంటే వారి జీవన స్థితిగతులు తారుమారయ్యే దయనీయమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారి ఉపాధికి, ఆదాయానికి మరింత హామీ, భరోసా ఇచ్చే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పట్టణాల్లోని పేదల కోసం చేపట్టాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్ సూచించారు.

పెరుగుతున్న పేదరికం :

ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం వలన పట్టణ ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లెక్కల ప్రకారం 2019 అక్టోబర్ నుంచి 2021 మార్చ్ మధ్యలో గరిష్టంగా 21 శాతం నిరుద్యోగం నెలకొని ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణాల్లోని పేదలకు అండగా ఉండడం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం అత్యవసరం అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన పలు కమిటీలు, దేశంలోని వివిధ సంస్థలు పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఒక ఉపాధిహామీ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ తన లేఖలో ప్రస్తావించారు. గతంలో పార్లమెంట్ సభ్యుడు భర్తుహరి మహతాబ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ , సిఐఐ లాంటి సంస్థలు పట్టణ ప్రాంతాల్లోని ప్రజల సామాజిక భద్రతను పెంచేందుకు పట్టణ ఉపాధిహామీ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించిన విషయాన్ని మంత్రి కెటిఆర్ ప్రస్తావించారు.

రానున్న బడ్జెట్ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకోండి :

ప్రస్తుతం పట్టణాల్లో నెలకొని ఉన్న పరిస్థితులతో పాటు సమీప భవిష్యత్తులో పెరిగే పట్టణ పేదరికం అంచనాల నేపథ్యంలో రానున్న బడ్జెట్ సమావేశాల్లో పట్టణ పేదల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం సముచితంగా ఉంటుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల వైపు భారీగా వలస వస్తున్న గ్రామీణ పేదల కోసం పట్టణాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయస్థాయిలో అసంఘటిత రంగంలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం కేవలం పట్టణాలకే ఉన్నదని, అయితే ఈ అసంఘటిత రంగంలో పేదలు పని చేసేందుకు వీలు కల్పించేలా వారికి నైపుణ్య అభివృద్ధి, ఫైనాన్షియల్ ఇంక్లుషన్, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం వంటి అనేక చర్యలను తాను ప్రతిపాదించే ఈ ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా చేర్చాలని కెటిఆర్ సూచించారు.

దేశంలో ఎక్కడైనా :

లాక్‌డౌన్ సమయంలో దేశం చూసిన హృదయ విదారకమైన పట్టణ పేద ప్రజల వలస సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలంటే, పట్టణ అసంఘటిత రంగాన్ని మరింత బలోపేతం చేయడం మాత్రమే మార్గమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాల ప్రజలు భారీ ఎత్తున ఇతర రాష్ట్రాల్లోని పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితులు ఉన్నందున దేశంలోని ఎక్కడివారైనా ఏ పట్టణంలోనైనా ఈ ఉపాధి హామీ లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని ఆయన సూచించారు.

పట్టణాలు ఆర్ధిక వ్యవస్థకు ఇంజన్లు :

దేశంలోని పట్టణాలు భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంజన్లుగా పనిచేస్తున్నాయన్న విషయాన్ని కేంద్రం గుర్తించాలని మంత్రి కెటిఆర్ సూచించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన పట్టణ ప్రాంతాల్లోని పేదలకు చేయూత అందించాల్సిన అవసరం కేంద్ర-,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగర ప్రభుత్వాలైనా పురపాలికలపై కూడా ఉందన్నారు. ఇవి తమ పరిధిలో చేపట్టే హరితహారం లాంటి గ్రీనరీ కార్యక్రమాలు, పట్టణాలలో చేపట్టే ఫుట్ పాత్‌లు, డ్రైనేజీల నిర్మాణము వంటి ప్రాథమిక మౌలిక వసతుల నిర్వహణ వంటి కార్యక్రమాల్లో పట్టణ పేద ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తూ వారి ఉపాధికి హామీ ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకునే అవకాశం ఉందన్నారు.

ఉపాధికి భరోసా కల్పించాలి :

ప్రస్తుతం ఉన్న అనిశ్చితమైన ఉపాధి అవకాశాలు, ఆదాయ మార్గాలను దాటుకుని పట్టణ పేద ప్రజలు నాణ్యమైన జీవన ప్రమాణాలను అందుకోవాలంటే, వారి ఉపాధికి మరింత హామీ కల్పించడమే మాత్రమే ఏకైక పరిష్కార మార్గమని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రత్యేక పట్టణ ఉపాధి హామీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని కేంద్రానికి రాసిన లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *