హైదరాబాద్ లో 72 కిలోమీటర్లకే డిజైన్ చేసిన మెట్రో రైలు మార్గాన్ని రెండవదశలో 200 కిలోమీటర్ల మేరకు విస్తరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మెట్రో రైల్ అథారిటీ అధికారులను ఆదేశించారు. ఉగాదినాటికల్లా నాగోల్-మెట్టుగూడకు మెట్రో రైలు సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని కూడా కేసీఆర్ అధికారులకు సూచించారు.
బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి మెట్రో రైల్ ప్రాజెక్టు పనితీరుపై సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో మెట్రో రైల్ కాంట్రాక్టు సంస్థ ఎల్అండ్‌టీ చైర్మన్ వైఎం దేవస్థలి, మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, నూతన పారిశ్రామిక విధానానికి ఆకర్షితులై చాలా మంది పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, హైదరాబాద్ నగర విస్తరణను, నగరానికి వస్తున్న ఐటీఐఆర్ ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు ప్రాజెక్టును మరో 200 కిలోమీటర్ల మేరకు పొడిగించాలని చెప్పారు.
హైదరాబాద్ నగర జనాభా మరికొద్ది రోజుల్లోనే రెండు కోట్లను దాటనున్నదని, అందుకు అనుగుణంగా త్వరలోనే నగరంలో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. గత ప్రభుత్వాలు అవగాహన రాహిత్యంతో మెట్రో రైలును కేవలం 72 కిలోమీటర్లకే పరిమితం చేశాయన్నారు. మెట్రో రైల్ నిర్మాణంలో తలెత్తిన కోర్టు వివాదాల్ని వెంటనే పరిష్కరించాలని త్వరలోనే మున్సిపల్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మెట్రో పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని సీఎం వివరించారు.