mt_logo

మనం చేసింది చెప్పండి – కేసీఆర్

-పథకాలపై క్షేత్రస్థాయి ప్రచారానికి సీఎం ఆదేశం
-పార్టీ ప్రజాప్రతినిధులకు అవగాహనలేమిపై అసంతృప్తి
-70 రోజుల్లో చేసిన కార్యక్రమాలు వివరించాలని ఆదేశం
-ఎంపీ, ఎమ్మెల్యేలకు పథకాల వివరాల ప్రతులు పంపిణీ
ఏ ప్రభుత్వమైనా ఒక పథకాన్ని అమలు చేసినపుడు ఆ ఫలాలు కిందిస్థాయి లబ్ధిదారుడికి చేరాలి. ఇది జరగాలంటే ప్రజల్లో ఆ పథకంపై సంపూర్ణ అవగాహన రావాలి. ఇందుకు ప్రజాప్రతినిధులు అనుసంధానకర్తలుగా వ్యవహరించాలి. ఇవన్నీ జరిగితేనే ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా నిరుపేదల బతుకుల్లో వెలుగు నిండుతుంది. కొత్త రాష్ట్రం.. సరికొత్త పంథా నినాదంతో 70 రోజుల కిందట కొలువుదీరిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసింది. పంద్రాగస్టు పర్వదినాన వీటిని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఈ నేపథ్యంలో పథకాలు విజయవంతం కావడంతో పాటు ప్రభుత్వం ఏం చేస్తుందనే దానిపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన తీసుకురావడంపై సర్కారు దృష్టి సారించింది. ప్రభుత్వపరంగా ప్రచారం నిర్వహించనున్నా.. నిత్యం ప్రజల్లో ఉండే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వీటిని జనంలోకి తీసుకుపోతే మంచి ఫలితాలు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆశిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అవగాహన పెంచుకోవాల్సిన పార్టీ ప్రజాప్రతినిధులు ఆ స్థాయిలో చొరవ చూపకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఎంపీలు, ఎమ్మెల్యేలకు తొలుత ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

రుణమాఫీ మొదలు తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన అమరుల కుటుంబాలను ఆదుకునే ప్రక్రియకు ముఖ్యమంత్రి ఇప్పటికే శ్రీకారం చుట్టారు. రెండు దఫాల మంత్రివర్గం సమావేశంలోనూ మునుపెన్నడూలేని రీతిలో భారీ ఎజెండాకు ఆమోదం తెలిపారు. తెలంగాణ స్వయంపాలన ఇప్పుడే మొదలైనందున పునాది బలంగా, పారదర్శకంగా ఉండేందుకు పలు విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వీటిని ప్రజల చెంతకు తీసుకుపోయి, వారిలో అవగాహన కల్పించాలని పార్టీ ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో 25 అంశాలతో కూడుకున్న ప్రతులను పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు పంపిణీ చేస్తున్నారు. పథకం, హామీ అమలు, సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురై, ప్రస్తుతం పరిష్కారం పొందినవి.. ఇలా పలు అంశాలు ఉన్నాయి. వీటిని ఏ రీతిన ప్రజల్లోకి తీసుకుపోవాలో కూడా అందులో వివరించారు.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
రైతుల పంట రుణాలు మాఫీ:
తెలంగాణ రైతాంగం సరిగా పంటలు పండక, పండిన పంటకు గిట్టుబాటు ధరలేక అనేక అవస్థలు పడుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల రుణభారాన్ని పంచుకోవడం బాధ్యతగా భావించిన ప్రభుత్వం 40 లక్షల మందికి ఊరట కలిగేలా రూ.18వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసింది.

ఇన్‌పుట్ సబ్సిడీ:
ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుంచి తెలంగాణ ప్రాంతంలో అనేకరకాల ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. కానీ నాటి సర్కారు కేవలం సీమాంధ్ర ప్రాంత రైతులను ఆదుకుంటూ, తెలంగాణ రైతాంగాన్ని విస్మరించింది. ఈ నేపథ్యంలో 2009 నుంచి 2014 వరకు వివిధ ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు రూ.480.58 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అందించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. నేరుగా ఆ మొత్తాలు రైతుల ఖాతాలోకే వెళ్లనున్నాయి.

దళితులకు మూడెకరాల భూ పంపిణీ:
దళితులకు భూ పంపిణీ పథకం 30 ఏండ్లుగా ఉన్నా… నేటికీ గ్రామాల్లో దళిత కుటుంబాలు పస్తులుండే పరిస్థితి. ఈ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని అందించడంతో పాటు బోరు, కరెంటు మోటరు ఏర్పాటు చేసి, ఏడాది వ్యవసాయానికి అయ్యే ఖర్చును సైతం భరించేందుకు నిర్ణయించింది. దీనిని పకడ్బందీగా అమలు చేసేందుకే ముఖ్యమంత్రి ఎస్సీ అభివృద్ధి శాఖను తన వద్దనే ఉంచుకున్నారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ:
ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ టీఆర్‌ఎస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దానిని నెరవేర్చేందుకు రాష్ట్రంలోని 22వేలకు పైగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

అమరవీరుల కుటుంబాలకు చేయూత:
తెలంగాణ రాష్ట్ర సాధనకోసం 1969 నుంచి 2014 వరకు ఎందరో తమ ప్రాణాలు త్యాగం చేశారు. వారి త్యాగాలను గుర్తించి అమరవీరుల కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థిక సాయం, అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయాధారిత కుటుంబమైతే భూమి, పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి ముఖ్యమంత్రి సాయం అందించి ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, న్యాయవాదులు.. ఇలా అనేక రంగాల వారు శాంతియుతంగా ఉద్యమించారు. అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై అక్రమ కేసులు బనాయించి, నిర్బంధించాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా ఆ కేసులన్నింటినీ ఎత్తివేసింది.

ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్:
సకల జనుల సమ్మెతో తెలంగాణ ఉద్యమంలోనే అద్భుత పోరాటపటిమ ప్రదర్శించిన ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని మొదటి నుంచి కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ప్రత్యేకంగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని కూడా ప్రకటించారు. ఆ మాటకు కట్టుబడి ఇంక్రిమెంట్ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేశారు.

గల్ఫ్ బాధితులకు ప్యాకేజీ:
సొంత ఊర్లో ఉపాధి లేక కుటుంబ పోషణకు గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు అక్కడ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గల్ఫ్ బాధితులను ఏ ప్రభుత్వమూ ఆదుకున్నది లేదు. ఈ నేపథ్యంలో వారి కోసం కేరళ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా హైదరాబాద్:
తెలంగాణ గుండెకాయ అయిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే రూ.350 కోట్లతో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖకు కొత్త వాహనాలు, పరికరాలు ఇచ్చేందుకు నిధులు కూడా మంజూరు చేసింది. వైఫై నగరంగా తీర్చిదిద్దడం, పారిశ్రామికరంగానికి పెద్ద ఎత్తున చేయూతనివ్వడంతోపాటు శాశ్వతంగా ఐటీ ఇంక్యుబేటర్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.

సింగిల్ విండో పారిశ్రామిక విధానం:
తెలంగాణ ఆర్థికాభివృద్ధితో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడాలేని విధంగా సింగిల్ విండో విధానం అమలుకు నిర్ణయించింది. దీని ద్వారా పారిశ్రామికవేత్తలు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అవినీతికి తావుండదు.

విశ్వనగరంగా హైదరాబాద్:
రానున్న రోజుల్లో రెండు కోట్ల వరకు జనాభా చేరుకునే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఐటీఐఆర్ ప్రాజెక్టును పక్కాగా అమలు చేస్తూ, భవిష్యత్తులో అన్నిరకాల మౌలిక వసతులను తీర్చేలా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించేందుకు కన్సల్టెన్సీని నియమించుకోవాలని నిర్ణయించింది.

ముస్లింలకు 12% రిజర్వేషన్:
జనాభా నిష్పత్తిలో అవకాశాలు కల్పించేందుకు ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పించాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఎన్నికల్లో కేసీఆర్ ఈ హామీ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలుకు కమిషన్ కూడా వేశారు. ముస్లింల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌ను కేటాయించేందుకూ అంగీకరించారు.

గ్రామపంచాయతీలుగా గిరిజన తండాలు:
గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించాలని ఎన్నో ఏళ్లుగా గిరిజనులు పోరాడుతున్నారు. వారి ఆశ నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి దృఢ నిశ్చయంతో ఉన్నారు.

ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను రద్దు:
నిరుపేద, మధ్య తరగతి నిరుద్యోగ యువకులు ఉపాధి కోసం ఆటోలు నడుపుతున్నారు. వారి రోజువారీ సంపాదన కుటుంబ పోషణకు కూడా సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఆటో రిక్షాలపై రవాణా పన్ను సీఎం రద్దు చేశారు. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లపై కూడా రవాణా పన్ను మినహాయించారు.

పింఛన్ల పెంపు:
వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే పింఛన్లు సరిపోవడంలేదని, వాటిని పెంచాలని గతంలోనే టీఆర్‌ఎస్ అప్పటి ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చేందుకు పింఛన్ల పెంపును త్వరలో అమలు చేయనున్నారు.

కళ్యాణలక్ష్మి:
ఆడపిల్లకు పెళ్లి చేయడానికి నిరుపేదలు అష్టకష్టాలు పడుతున్నారు. లాంఛనాల పేరుతో అప్పుల్లో కూరుకుపోతున్నారు. వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం.. తన ఎన్నికల మ్యానిఫెస్టోలో లేకున్నా.. ప్రతి దళిత, గిరిజన ఆడపిల్ల పెళ్లికి రూ.50వేల ఆర్థిక సాయం చేసేందుకు కళ్యాణలక్ష్మి పేరుతో పథకం తీసుకువచ్చింది.

విద్యార్థుల కోసం ఫాస్ట్:
ఆర్థిక స్థోమతలేక చదువుకు దూరం అవుతున్న తెలంగాణ నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఫాస్ట్ పథకాన్ని రూపొందించింది. వృత్తి విద్య, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల ఆర్థిక భారాన్ని ఈ పథకం కింద ప్రభుత్వమే భరిస్తుంది.

హైదరాబాద్‌లో కల్లు దుకాణాల పునరుద్ధరణ:
లిక్కర్ మాఫియా ఒత్తిళ్లకు తలొగ్గి గత ప్రభుత్వాలు కల్లుగీత కార్మికుల నడ్డివిరిచేలా హైదరాబాద్‌లో కల్లు దుకాణాలపై నిషేధం విధించారు. ఎన్నిసార్లు ఆందోళన చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీ ప్రకారం ప్రభుత్వం హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను పునరుద్ధరించేందుకు నిర్ణయించింది. దసరా నుంచి ఇది అమలులోకి కూడా రానుంది.

ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వ గుర్తింపు:
గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం అందించే ఆర్‌ఎంపీ, పీఎంపీలు అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారు. వీరి గౌరవం పెంచడంతోపాటు ప్రజలకు నకిలీ వైద్యుల బెడద తప్పించేందుకు వీరికి శిక్షణ ఇచ్చి, ధ్రువపత్రాలను జారీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం:
రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందిస్తున్నది. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే వారికి రూ.3లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజక, కాంస్య పతకాలు సాధించిన వారికి రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే దానిని అమలులోకి కూడా తెచ్చింది.

ఎవరెస్టు విజేతలకు నగదు ప్రోత్సాహం:
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి, తెలంగాణ రాష్ర్టానికి గర్వకారణమైన గిరిజన, దళిత బిడ్డలు పూర్ణ, ఆనంద్‌లకు చెరో రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం అందించింది.

మన ఊరు – మన ప్రణాళిక:
రాజధాని హైదరాబాద్‌లో కూర్చుని గ్రామాల భవిష్యత్తును నిర్దేశించడం కాకుండా… క్షేత్రస్థాయిలోనే అవసరాలకు సంబంధించిన ప్రతిపాదనలు, సమస్యల పరిష్కారానికి సూచనలు రావాలనేది ముఖ్యమంత్రి అభిప్రాయం. ఈ నేపథ్యంలో వినూత్నంగా మన ఊరు – మన ప్రణాళిక పేరిట గ్రామాల్లోనే ప్రతిపాదనలు సిద్ధమైతే అందుకు అనుగుణంగా నిధులు మంజూరయ్యే విధానానికి శ్రీకారం చుట్టారు.

తెలంగాణకు హరితహారం:
తెలంగాణలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 210 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించింది. దీని ప్రకారం ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు నాటనున్నారు.
రాష్ట్రస్థాయి సలహా మండలి: వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపుణులు, అనుభవజ్ఙుల సలహాలు తీసుకునేందుకు రాష్ట్రస్థాయిలో సలహా మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనుభవజ్ఞుల సూచనలతో పాలన కొనసాగిస్తున్నది.

సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే:
ప్రభుత్వంవద్ద సరైన లెక్కలు లేకపోవడం వల్ల పథకాలన్నీ దుర్వినియోగమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేరోజు రాష్ట్రంలోని అన్ని కుటుంబాల స్థితిగతులు, ఆర్థిక, సామాజిక వివరాలను సేకరించే సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈనెల 19న దీనిని చేపట్టేందుకు ఆరోజు సెలవు దినంగా కూడా ప్రకటించింది.

పవర్‌లూమ్ కార్మికులకు రుణాలు మాఫీ:
దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్న కులవృత్తిదారులు, పవర్‌లూమ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం వారికి ఉన్న రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *