mt_logo

ప్రతి పైసా సద్వినియోగానికే సర్వే – కవిత

-నిజమైన లబ్ధిదారుల ఎంపికకు సరైన దారి
-గవర్నర్ అధికారాలపై రాజీపడే ప్రసక్తే లేదు
-టీ మీడియాతో టీఆర్‌ఎస్ ఎంపీ కవిత
తెలంగాణ ప్రజల సంక్షేమానికి, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సాయం చేరాలన్నదే సమగ్ర సర్వే ఉద్దేశమని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆంధ్ర పాలకులు ఆరోపిస్తున్నట్లుగా ఇందులో ఎలాంటి రహస్య ఎజెండా లేదన్నారు. ఈ సర్వేతో అనేక విధాలైన గణాంకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. తెలుగుదేశం, ఆంధ్రపాలకులు ఉద్దేశపూర్వకంగా సర్వేపై తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వం వెచ్చించే ప్రతి పైసా సద్వినియోగం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. లోక్‌సభ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆమె బుధవారం టీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రశ్న: సర్వే వెనుక రహస్య ఎజెండా ఉందని ప్రచారం జరుగుతున్నది.. దీనిపై మీరేమంటారు?
జవాబు: ఇది ఒక పథకం ప్రకారం ఆంధ్ర పాలకులు, తెలుగుదేశం నాయకులు చేస్తున్న దుష్ప్రచారం. ఖర్చు పెట్టే ప్రతి పైసా నిజమైన లబ్ధిదారులకు చేరాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గణాంకాలు సేకరిస్తున్నది.

సర్వే రాజ్యాంగ విరుద్ధమని ఆరోపణలు వస్తున్నాయి..?
నిజమైన లబ్ధిదారులను, అర్హులను గుర్తించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు ఈ సర్వేతో తేలేది కూడా అదే. ఇక, రాజ్యాంగంలో ఎక్కడా సర్వేలు నిషిద్ధమని పేర్కొనలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేండ్లకోసారి చేపట్టే జనగణనకు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర సర్వేకు ఏమాత్రం సంబంధం లేదు.

తెలంగాణేతరులను గుర్తించేందుకే ఈ సర్వే అన్న విమర్శలపై..
సీమాంధ్ర ప్రజలను గుర్తించడానికే ఈ సర్వేను తెరమీదకు తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్ర పాలకులు చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంత వాస్తవం కూడా లేదు.

ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి..?
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ఈ సర్వేకు సంబంధించి స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఒక కుటుంబంలో నలుగురైదుగురు ఉంటున్నప్పుడు సర్వే సమయంలో ఒక్కరు అందుబాటులో ఉన్నా సరిపోతుంది. ఉపాధి కోసం ముంబై, సూరత్, భీవండి, షోలాపూర్ నగరాలతోపాటు గల్ఫ్ దేశాలకు కూడా వెళ్లినవారు.. సర్వే కోసం రావాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబంలో ఒక్కరు ఉన్నా సరిపోతుంది. మిగతావారు ఎక్కడ ఉంటున్నారన్న ఆధారాలు చూపితే సరిపోతుంది. పెండ్లిళ్లు ఆపుకోవాలని, అత్యవసర వైద్య సేవలు, కుటుంబంలో విషాదం జరిగినా ఇంట్లోనే ఉండాలని అనడం.. ఇవన్నీ పుకార్లే.

తెలంగాణ ప్రభుత్వాన్ని దోషిగా చూపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా..?
తెలంగాణ అంటే వెంటనే కేసీఆర్ గుర్తుకొచ్చే తీరులో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని దోషిగా చూపెట్టే ప్రయత్నమైతే జాతీయ స్థాయిలో ఓ మేరకు జరుగుతూనే ఉంది. దీనికి పాల్పడుతున్నది ఆంధ్ర నాయకులే.

ఫీజుల వ్యవహారంలో వస్తున్న విమర్శలపై మీ కామెంట్..?
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బిడ్డలకు మాత్రమే ఫీజులు చెల్లించాలనే విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు చెల్లిస్తే.. రాష్ట్రంలో చదువుతున్న అన్ని రాష్ట్రాల విద్యార్థులకూ చెల్లించాల్సి వస్తుంది.

1956 నిబంధనపై ఎందుకు విమర్శలు వస్తున్నాయి..?
తెలంగాణ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోటీ పడి చేయలేకపోతున్నది. అందుకే ఓర్వలేనితనంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉద్దేశపూర్వకంగానే ఆ రాష్ట్ర నాయకులు విమర్శలు చేస్తున్నారు.

గవర్నర్‌కు అదనపు అధికారాలు ఇవ్వడంపై…
హైదరాబాద్‌పై అధికారాలు తెలంగాణ ప్రభుత్వానికే ఉండాలి తప్ప, గవర్నర్‌కు అప్పగించడానికి వీల్లేదని కేసీఆర్‌తోపాటు తెలంగాణ రాజకీయ ప్రతినిధులంతా చెప్తూనే వచ్చారు. బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి తెలుగుదేశం ఈ చట్టాన్ని సాకుగా చూపి గవర్నర్‌కు అదనపు పెత్తనం కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నది. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 70 రోజుల్లో హైదరాబాద్ నగరంలో ప్రజలు భయాందోళనకు గురయ్యే స్థాయిలో ఒక్క నేరమైనా జరుగనప్పుడు గవర్నర్‌కు అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది. గవర్నర్‌కు అదనపు అధికారాలు ఇవ్వడం వెనక చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు ఉన్నారన్నది బహిరంగరహస్యం. ఇలాంటి వందలాది మంది నాయకులను దాటి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా అది కొత్తేమీ కాదు. ఈనెల 18న హోం మంత్రి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించి మార్పులు చేర్పులు చేద్దామని హామీ ఇచ్చారు.

కేంద్రసాయం లేకపోతే తెలంగాణ అభివృద్ధి సాధ్యమేనా?
కేంద్రం నుంచి అందే ఆర్థిక సాయం ఒక నిర్దిష్ట శాతంగానే ఉంటుంది. దాదాపు 90 శాతం ఆర్థిక వనరులు రాష్ట్రం నుంచే సమకూరుతాయి. కేంద్రం సాయం చేయకపోతే బతకలేమనే గుండెజారిపోయే పరిస్థితి అవసరం లేదు. తన కాళ్ల మీద తాను నిలబడే తెగింపు తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఎవరు అవునన్నా.. కాదన్నా… ఆరు నూరైనా తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ తథ్యం.

Courtesy: నమస్తే తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *