mt_logo

మెట్రో ప్రాజెక్టుపై మీడియా ప్రచారం నమ్మొద్దు – వీకే గాడ్గిల్

హైదరాబాద్ లో ఎల్‌అండ్‌టీ చేపడుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన మెట్రో రైల్ ప్రాజెక్టుపై కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు ప్రచురించడం పట్ల ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ సీఈవో వీకే గాడ్గిల్ మండిపడ్డారు. కావాలనే కొన్ని మీడియా సంస్థలు మెట్రో ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేస్తున్నాయని, తెలంగాణ ప్రభుత్వంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రభుత్వ సహకారంతోనే ప్రాజెక్టును అత్యంత వేగంగా నిర్మిస్తున్నామని తెలిపారు. మెట్రో ప్రాజెక్టు నుండి వైదొలగాలని భావిస్తూ రాష్ట్రప్రభుత్వానికి ఎల్‌అండ్‌టీ లేఖ రాసిందని కొన్ని పత్రికల్లో కథనాలు రావడంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం కేసీఆర్ బుధవారం సచివాలయంలో ఎల్‌అండ్‌టీ సీఈవో వీకే గాడ్గిల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో సమావేశమయ్యారు.

అనంతరం గాడ్గిల్ మీడియాతో మాట్లాడుతూ ఒక పెద్ద ప్రాజెక్టును చేపట్టినప్పుడు అందులో ఉండే సమస్యలపై ప్రభుత్వంతో ఉత్తరప్రత్యుత్తరాలు జరపడం అనేది చాలా సహజమని, అదేమీ క్రిమినల్ చర్య కాదని చెప్పారు. రాష్ట్రం విడిపోకముందే అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కూడా లేఖలు రాశామని, ఈ సంవత్సరం ఫిబ్రవరి 14 న కూడా ఏపీ సీఎం చంద్రబాబుకు కొన్ని సమస్యలపై లేఖ రాశామని, అలాగే ఈనెల 10 వ తేదీన కూడా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశామని అన్నారు. గతంలో రాసిన లేఖల్లోని అంశాలను ఇప్పటి లేఖలోని అంశాలను కలిపేసి పత్రికలు ప్రచురించాయని ఆరోపించారు. ప్రాజెక్టును మధ్యలో ఆపేసే ఆలోచన తమకు లేదని, ఒప్పందాలు ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

ఇప్పటికీ దీనిని వయబుల్ ప్రాజెక్టుగానే భావిస్తున్నట్లు, దేశంలో ఏ ప్రాజెక్టులో జరగనంత వేగంగా హైదరాబాద్ లో పనులు చేస్తున్నామని, కేవలం సుల్తాన్ బజార్, అసెంబ్లీ ఎదురుగా మాత్రమే ప్రభుత్వం కొన్ని సూచనలు చేసిందని వివరించారు. ఊహాజనితమైన కథనాలతో ఎలాంటి ఆధారం లేకుండా పెద్ద ప్రాజెక్టుకు అవాంతరాలు సృష్టించవద్దని, మెట్రో రైల్ ప్రాజెక్టులో రెండు పార్టీలకు డామేజ్ కలిగించేలా వార్తలు రాయడం సరైంది కాదని, ఈ విషయమై ఎల్‌అండ్‌టీ ఉన్నతస్థాయి యాజమాన్యం కూడా విచారం వ్యక్తం చేసిందని గాడ్గిల్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *