mt_logo

మెదక్ విజయాన్ని ఆస్వాదించకుండా కుట్ర – కేటీఆర్

మెదక్ పార్లమెంటు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ సాధించిన భారీ విజయాన్ని అందరూ ఆస్వాదించకుండా ఉండేందుకే కొన్ని పత్రికలు మెట్రోరైల్ ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేస్తున్నాయని, రెండు పత్రికల్లోనే వార్త వచ్చిందంటే ఖచ్చితంగా ప్రభుత్వంపై విషప్రచారం చేసేందుకు కుట్ర జరుగుతుందనే విషయం స్పష్టమవుతుందని పంచాయితీ రాజ్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం తాజ్ కృష్ణా హోటల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిని మెట్రో రైల్ పై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై విలేకరులు ప్రశ్నించగా, మెట్రోరైల్ పనులను నిలిపివేస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తనకు తెలియదని, పత్రికల్లో వచ్చే ప్రతి వార్తా నిజం కాదని, మీడియా బాధ్యతతో వ్యవహరించాలని, లేఖపై సీఎం కేసీఆర్ సమీక్షించి స్పందిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ విషయమై ఢిల్లీలోని తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి బుధవారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయడానికే కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని, మెదక్ లోక్ సభలో టీఆర్ఎస్ సాధించిన ఘన విజయాన్ని జీర్ణించుకోలేకే మెట్రోరైల్ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నాయని, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎల్‌అండ్‌టీ సంస్థ రాసిన లేఖను బహిర్గతం చేయకుండా ఇప్పుడు కొత్తగా లేఖ రాసినట్లు మీడియా ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తుందని, ఎల్‌అండ్‌టీ సంస్థ చైర్మన్ గాడ్గిల్ కూడా ఆ లేఖ కొత్తగా రాసింది కాదని మీడియాకు కూడా వివరించారని, పనిగట్టుకుని ఇలాంటి అవాస్తవాలు ఎందుకు ప్రచురిస్తారో ఆ మీడియా సంస్థలకే తెలియాలని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జనం వెళ్ళిపోతున్నారని, పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని ప్రచారం చేశారని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ప్రయాణికులే ఉండట్లేదా? లేకపోతే రోడ్లపై ట్రాఫిక్ తగ్గిపోయిందా? అని, హైదరాబాద్ నుండి అన్నీ తరలిపోతుంటే సిగ్గులేకుండా మీరెందుకు ఉంటున్నారని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *