mt_logo

మీరా మాకు మంచీ మర్యాదా నేర్పేది?

[నిన్న ప్రెస్ క్లబ్ లో పరకాల ప్రభాకర్ బ్యాచి మరోసారి పత్రికా సమావేశం పెట్టబోయి భంగపడ్డది. తెలంగాణ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక అర్ధాంతరంగా సమావేశం ముగించి సర్దుకున్నారు. అయితే ఈ సంఘటన గురించి రమేశ్ కందుల అనే సీమాంధ్ర జర్నలిస్టు, తెలంగాణ జర్నలిస్టులకు పాత్రికేయ విలువలు లేవనే అర్థం స్ఫురించే వ్యాఖ్యలు చేశాడు. దానికి మన సవాల్ రెడ్డి ఇచ్చిన మూతోడ్ జవాబు ఇది]

ఫర్లేదు..మొత్తానికి తెలుగు జర్నలిస్టుల్లో చాలా గొప్ప మేధవులున్నారు…

గిల్లినమ్మ బాగానే ఉంటది.ఏడ్చినమ్మే గయ్యాలి అవుతది.

డియర్ సర్…..

ఒక విషయం చెప్పండి.. వాజపేయి బస్సులో లాహోర్ కు వెళ్లిన సందర్భంలోనూ, పాక్ సైనికులు భారత సైనికుల తలలు కోసుకుని వెళ్లిన స్థితిలోనూ వాఘా సరిహద్దులో ఒకే స్థితి ఉంటుందా?

ఇవాళ ఆంద్రవారు తెలంగాణలో… తెలంగాణ వారు ఆంధ్రలో వారి వాదనలు వినిపించే స్థితి ఉందా? ? అసలు పర్యటనలు చేసే పరిస్థితి ఉందా?

తెలంగాణనుంచి తిరుపతికి ప్రయాణాలు ఏ మేరకు పడిపోయాయో మీకు తెలుసా?

ఈ పరిస్థితిలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లు పెట్టి జయశంకర్ అబద్దాలు రాశాడని తెలంగానవాదమే లేదని చాటి చెప్పాల్సిన చారిత్రక అవసరం ఉందా?

మరి కేసీఆర్ కోదండరాం విజయవాడ వెళ్లి ఆంధ్రాది దొంగల ఉద్యమం అంటూ ప్రెస్ మీట్ పెడితే అక్కడ పెట్టనిస్తారా? పెట్టే పరిస్థితి ఇవాల అక్కడుందా? మీరు పూచీ పడతారా?

బీజేపీ జై ఆంధ్ర సభలను పెట్టనిచ్చారా? వసంత నాగేశ్వరరావు సభలు నిర్వహించకుంటామన్నా నిర్వహించనిచ్చారా?

తిరుపతిలో విహెచ్ పై జరిగిన దాడి ఏం చెబుతున్నది?

కర్నూలు ఆస్పత్రి ఉదంతం ఏం చెబుతున్నది?

ఇంకా ఇతర అనేక సంఘటనలు ఏం చెబుతున్నాయి?

అసలు విశాలాంధ్ర గ్యాంగు ఇక్కడ సమావేశం పెట్టాల్సిన అవసరమేమిటి? విజయవాడలో పెడితే సమైక్యాంధ్ర ఉద్యమమని అనరా? అక్కడ మాట్లాడితే టీవీల్లో ప్రసారాలే రావా? జనం చెవులు మూసుకుంటారా?

అంత ఆలోచన చేయగలరని నేననుకోను గానీ…. మీకు తెలియని విషయం ఒకటుంది.

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి,
ఒక కాల విభజన రేఖ ఉంది….
అది… 2009 dec 9.
అది రెండు ప్రాంతాల మధ్య సంబంధాన్ని.. సంయమనాన్ని…శాంతిని.. శాశ్వతంగా భూస్థాపితం చేసింది.
మీ ఆంధ్ర జర్నలిస్టులకు అర్థం కాకపోవచ్చు…

అంతకు ముందు హైదరాబాద్ లో అనేక మంది ఆంద్ర మేధావులు అనేక సభల్లో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారు పోట్లాడారు… సెమినార్లు జరిగాయి.. చర్చలు కూడా జరిగాయి
టీవీల్లో గంటలకు గంటల చర్చలు జరిగాయి.
ఇక్కడి వారు అక్కడి వారు పాల్గొన్నారు.
జర్నలిస్టులే కాదు… ఏ తెలంగాణ వాడూ కాదనలేదు…
కారణం అది సాధారణ కాలం.. శాంతి నెలకొని ఉన్న ఉద్రిక్తతలు లేని కాలం…
ఎవరైనా ఏదైనా మాట్లాడుకునే అవకాశం ఉండింది.
అది తెలంగాణకు భావవ్యాప్త దశ…

డిసెంబర్ తొమ్మిది ప్రకటన తర్వాత
పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పడానికి జర్నలిస్టులు కాదు… రిక్షావాడుకూడా చెబుతాడు
తెలంగాణను అడ్డుకున్న వారిమీద తెలంగాణ వారికి ఏ భావన రావడం సహజమో అదే వచ్చింది.
నోరు తెరిచి బయట పెట్టవచ్చు లేకపోవచ్చు…కానీ అంతరాల్లో తెలంగాణ వారందరిదీ ఒకటే భావన.
అదే జర్నలిస్టుల్లోనూ వచ్చింది.
సహజం.. వీళ్లూ మనుషులే కాబట్టి..
తెలంగాణ జర్నలిస్టులు రెచ్చిపోయారు… నేను తలదించుకుంటున్నాను అనే అర్భకులకు …

ఓసారి సమైక్యంధ్ర కవరేజిలో లైవ్ లో జర్నలిస్టులు ఎంత ఎమోషనై పోతున్నారో చూడమనండి…
కేసీఆర్ తన ఉద్యోగులకు చెప్పుకున్న ఓ అంశానికి సొంత ఉక్రోశం జోడించి
ఎన్టీవీలో ఓ న్యూస్ రీడరమ్మ ముక్కుపుటాలెగరేస్తూ..
కేసీఆర్ ఆంధ్ర ఉద్యోగులను పంపేస్తామంటున్నారు మీరేం చెబుతారని
అవతలివారిని వాకబు చేసినపుడు కురిపించిన ఎమోషన్ వీలుంటే చూడండి..
ఆంధ్రలో జర్నలిస్టులు తిరగబడరు కదా అనొచ్చు.. బయటి వాడు అడ్డుకోవడానికి అక్కడ పోలీసులు అడ్డంకు కాదు.
ఇక్కడ బయటివారిని రానిస్తారా లేదా నేను చెప్పక్కర్లేదు.
ఆ వెసులుబాటు చూసుకుని ఏదైనా మాట్లాడదాం అనుకుంటే తిరుగుబాటు బాధ్యత జర్నలిస్టులు తీసుకుంటారు…. మరోదారి లేదు.

ఎక్కడైనా మాట్లాడే హక్కుంది….ట
ఉంటుంది…. ఎప్పుడు…?
అన్నీ ప్రశాంతంగా ఉద్రిక్తతలకు తావు లేనపుడు..
ఇపుడు హైదరాబాద్ లో ఆ పరిస్థితి ఉందా?
ఓవైపు ప్రభుత్వకార్యాలయాల్లోనే ఉద్యోగులు ప్రాంతాల వారీగా కొట్టుకునే స్థితి ఉంటే
సభలు పెట్టి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడడమేమిటి?
నిజంగా రాష్ట్రం మేలు కోరేవాడు…
సమైక్యంగా ఉండాలని అభిలషించే వాడు సభ పెట్టి రెచ్చగొడతాడా?
లేక అందరినీ పిలిచి మాట్లాడతాడా?
అది కలిపిఉంచే ఉద్దేశమా…?
అదేం కాదు….
తెలంగాణ వాడిని సవాలు చేసి వాడి గడ్డమీదే వాడిని తిడుతూ మాట్లాడా అనిపించుకోవాలి
హీరో కావాలి… తెలంగాణ వాడి మీద ఆంద్ర ఆధిపత్యం చాటి చెప్పాలి…

గుజరాత్ లో నరమేధం తరవాత మోడీ హైదరాబాద్ వస్తానన్నప్పుడు కమిషనర్ అనుమతి నిరాకరించేరు. కానీ తర్వాత వచ్చాడు వెళ్లాడు.
అదే హైదరాబాద్, అదే మోడీ, అదే హక్కు
తేడా ఎందుకు… చెప్పాలా?

మరి తెలంగాణ జర్నలిస్టుల అభ్యంతరమేమటి?
పరకాల సభ సజావుగా సాగిపోతే… ఆ మరుక్షణమే…
కందుల రమేష్ గారి టీవీలనుంచి అంతటా తెలంగాణ వాదం తగ్గిపోయిందా? అనే క్వచ్ఛన్ మార్కు స్కోలింగులు చర్చలు మొదలవుతాయి.. ఉద్యమం చల్లారిందా… ఉప్పు తక్కువైందా…చక్కెర ఎక్కువైందా ఇంగువ సరిపోలేదా అనే వెకిలి వ్యాఖ్యలు మొదలవుతాయి.

12 ఏళ్ల నిరంతర పోరాటాలు…లాఠీ దెబ్బలు అరెస్టులు రిమాండులు అవమానాలు కుట్రలు బలిదానాలు చేసి సాధించుకున్న చిరకాల స్వప్నం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నవాళ్లకు భయాలుంటాయి..ఆందోలనలుంటాయి..
తెలంగాణ ప్రక్రియలో మళ్లీ నిప్పులు పోస్తారేమేననే భయం ఉంటుంది. అనుభవాలు అలాంటివి.
ఢిల్లీకి తప్పడు సంకేతాలు వెళతాయన్న అనుమానం…

ఇప్పటికే దూదిపింజల్లాంటి ఆంద్ర ఉద్యగులు ఎగిరెగిరి పడుతూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటుంటే ఎదురు తిరగాలా వద్దా అర్థం కాని స్థితి. హైదరాబాద్ లో రక్షణ అని కలరింగులు ఇస్తారన్న భయంతో పంటిబిగువున ఆగ్రహాన్ని అణచుకుంటున్న స్థితి..

అంతే తప్ప ఏ సన్నాసిగాడో ఏదో సమావేశం పెట్టగానే అయ్యేదీ పొయ్యేదీ ఏమీ ఉండదని వీళ్లకు తెలుసు.
పరువుకు పట్టుదలకు అధిపత్యానికి ధిక్కారానికి సంబంధించినది ఈ అంశం
విషయం లోతు తెలిసీ తెలియనట్టు ఉపరితల అంశాలు పట్టుకుని చేసే వ్యాఖ్యలు
ఒక సీనియర్ జర్నలిస్టుకు శోభనివ్వవు…

సభ్యతకు మన్ననకు మేధసంపత్తికి విశ్లేషణలకు…వివేకానికి…
తెలంగాణ జర్నలిస్టులు పెట్టింది పేరు…
నాటి సురవరం నుంచి వరదాచారినుంచి నేటి యాదగిరి, అల్లం నారాయణ, శ్రీనివాస్ ల దాకా ఆ వారసత్వాన్ని అంతా కాలరెగిరేసుకుని కాపాడుతున్నవారే…
కులగోత్రాలు, మూర్చ బిళ్లలతో చెలామణీ అయ్యే వారినుంచి మంచీ, మర్యాదా నేర్చుకునే దుస్థితి మాకు పట్టలేదు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *