రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న వేళ, చంద్రబాబులోని సమైక్యవాది మరోసారి బుసలు కొడుతున్నాడు. పైకి తెలంగాణకు వ్యతిరేకం కాదని కల్లబొల్లి మాటలు చెప్పే బాబు, నిజానికి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని పలు పర్యాయాలు రుజువైంది.
ఇప్పుడు తాజాగా ప్రధాని మన్మోహన్ కు చంద్రబాబు రాసిన లేఖతో ఆయన మరోసారి తెలంగాణ ఆకాంక్షలను చిదిమేసే ప్రయత్నం చేశాడు.
దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు రోడ్డెక్కుతున్నా, ఆత్మార్పణాలు చేసుకుంటున్నా కించిత్ జాలిపడని చంద్రబాబు నాలుగు వారాల సీమాంధ్ర ఆందోళనకే చలించిపోయి ప్రధానికి ఇప్పటికే రెండు లేఖలు రాశాడు.
నిన్నటి లేఖలో ఉద్యమాల వల్ల హైదరాబాద్ సర్వనాశనమై పోయిందని అబద్ధపు కూతలు కూశాడు. నిజానికి హైదరాబాదులో కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో కానీ ఏ పరిశ్రమకూ తెలంగాణ ఉద్యమం వల్ల నష్టం వాటిల్లలేదని సాక్షాత్తూ ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. మొన్న తెలంగాణ ప్రకటన వచ్చిననాడు హైదరాబాదులోని అనేక సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు కూడా హర్షం వ్యక్తం చేశారు. నిజాలు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం హైదరాబాదుకు ఏదో జరిగిపోయిందని గోబెల్స్ ప్రచారానికి దిగుతున్నాడు.
ఇక చంద్రబాబు సీమాంధ్రలో చేపట్టనున్న యాత్ర ఎజెండా కూడా తెలంగాణ అడ్డుకోవడమే. ఇరుప్రాంతాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని, ప్రభుత్వ కమిటీ వేసి మళ్ళీ అన్ని వర్గాల ప్రజలతో చర్చలు జరిపాకే తెలంగాణ ఏర్పాటు చేయాలనే దుర్మార్గమైన డిమాండ్లతో ఆయన సీమాంధ్రలో యాత్ర చేయబోతున్నాడు. అందరికీ ఆమోదయోగ్యం, కమిటీ ఏర్పాటు అనే రెండు డిమాండ్ల లక్ష్యం తెలంగాణ ఏర్పాటు ఆపడమే.
తెదేపా ఎప్పటికైనా సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాల కొరకే పనిచేస్తది అని చంద్రబాబు తన తాజా లేఖతొ, యాత్రతో నిరూపిస్తున్నాడు కనుక ఆ పార్టీని తెలంగాణ ప్రజలు బొందపెట్టుడు ఖాయం.