పంద్రాగస్టు వేడుకల సందర్భంగా మెదక్ జిల్లా సంగారెడ్డిలోని పరేడ్ గ్రౌండ్స్ లో భారీ నీటిపారుదల శాఖా మంత్రి టీ హరీష్ రావు జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో మెతుకుసీమ మహోజ్వల పాత్ర పోషించింది. ఉద్యమానికి బీజం పడింది ఇక్కడే. రేపటి బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా ఇదే స్ఫూర్తి ప్రదర్శించాలని అన్నారు. జిల్లా ప్రజలతో సీఎం కేసీఆర్ కు, తనకు జన్మ జన్మల బంధం అని, పుట్టిన నేల ఋణం తీర్చుకునే సువర్ణావకాశం వచ్చిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రస్తుతం సింగూరు జలాలు హైదరాబాద్ కు వెళ్తున్నాయని, కృష్ణా జలాలను హైదరాబాద్ తరలించేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఉపయోగించే ఆలోచన ఉందన్నారు. దీంతో సింగూరు జలాలను జిల్లాకే వాడుకోవచ్చని, సిద్దిపేట తరహాలో అన్ని గ్రామాలకు మంచినీళ్ళు రప్పిస్తామని హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా ముద్దుబిడ్డ సీఎం కేసీఆర్ సారధ్యంలో బంగారు తెలంగాణగా చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, సీఎం ప్రవేశ పెడుతున్న పథకాలు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని హరీష్ రావు చెప్పారు.