భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు సాగుయోగ్యమైన మూడెకరాల భూమిని ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో లాంచనంగా ప్రారంభించింది. అయితే ఈ పథకం పలు రాష్ట్రాలను ఆకర్షిస్తుంది. పథకం తీరుతెన్నులపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రెటరీలు తెలంగాణకు చెందిన సంబంధిత అధికారులకు ఫోన్ చేసి జీవో కాపీలు పంపించాలని కోరుతున్నారు.
భూసేకరణ, కొనుగోలు, లబ్దిదారుల ఎంపికకు పాటించాల్సిన పద్ధతులు, ఇతర అంశాలకు సంబంధించి అధికారులనుండి సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు పార్లమెంటులో తెలంగాణ ఎంపీలను కలిసి భూపంపిణీపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీలు ఇవ్వాలని అడుగగా ఎంపీలు జీవో కాపీలతో పాటు ఇతర వివరాలను వారికి అందించారు.
ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలలోపే ఆగస్ట్ 15న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భూమి ఇవ్వడమే కాకుండా బోరు వేయించడం, సంవత్సరానికి అయ్యే ఖర్చంతా భరించడం తదితర అంశాలు వివిధ రాష్ట్రాల నేతలను ఆకట్టుకుంటున్నాయి.