ఈ నెల 9వ తేదీన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. ఈ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులందరూ హాజరు కావాలని కేసీఆర్ ఆదేశించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత జరిగే మొదటి సమావేశం కావడంతో ఈ సమావేశం చర్చనీయాంశమయింది. ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలు, ప్రచారం వల్ల రాబోయే ఫలితాలపై అధినేత చర్చించనున్నారు.
ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటన ద్వారా రోజుకు 9నుండి 10 సభల్లో ప్రసంగించిన గులాబీబాస్ ఎన్నికలు ముగిసిన తర్వాత మెదక్ జిల్లా, గజ్వేల్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకున్నారు. స్వల్పవిరామం తర్వాత ఆదివారం హైదరాబాద్ కు విచ్చేసిన ఆయనను పలువురు నేతలు కలిశారు. కేసీఆర్ ను కలిసిన వారిలో బీబీ పాటిల్, జగదీశ్వర్ రెడ్డి, కొండా సురేఖ, మురళి, శ్రీనివాస్ గౌడ్, సహోదర్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. 75కు పైగా అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ గెలుస్తుందని, తెలంగాణలో తొలి ప్రభుత్వం టీఆర్ఎస్ దే నని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు.