mt_logo

ఎక్కడివారికక్కడే పెన్షన్ల కేటాయింపు..

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన, వేతనాలు, పెన్షన్ల కేటాయింపులో ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి రాష్ట్రస్థాయి పోస్టులు 52వేల వరకు ఉన్నట్లు, ఉద్యోగుల విభజనలో ఎలాంటి ఆప్షన్లు ఇవ్వకుండానే ఉద్యోగుల కేటాయింపులు చేసే అవకాశం ఉందని తెలిసింది. జూన్ నెల వేతనాలు ఏ రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులకు ఆ రాష్ట్రమే చెల్లించనుంది.

సీమాంధ్రకు చెందిన పెన్షన్ దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రాంతానికి చెందిన పెన్షన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్లు చెల్లించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలో 2.39లక్షల మంది పెన్షన్ దారులకు నెలవారీ చెల్లింపులు దాదాపు రూ. 506కోట్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని 3.40లక్షలమందికి నెలవారీ చెల్లింపులు దాదాపు రూ. 706కోట్లు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 25వ తేదీలోగా విభజన ప్రక్రియ పూర్తికానున్నందున మే నెల జీతాలు 24నే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు.

రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వుబ్యాంకు ఖాతాలు జూన్ 2నుండి అమల్లోకి రానున్నాయని, ఫైళ్ళకు సంబంధించిన విభజన కూడా దాదాపు పూర్తి అయ్యిందని, సచివాలయ విభజన ప్రక్రియ కూడా ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. సచివాలయంలోని ఏ, బీ, సీ, డీ బ్లాకులు తెలంగాణ ప్రభుత్వానికి కేటాయిస్తూ, రాకపోకలకోసం ప్రత్యేక రోడ్డు, ప్రవేశద్వారం కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *