తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గతంలో ప్రకటించిన జూన్ 2న కాకుండా మే 16వ తేదీన ప్రకటించాలని టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఎన్నికల ఫలితాలు ఈనెల 16న వెలువడుతున్న సందర్భంలో రాజ్యాంగపరమైన సమస్యలు తలెత్తకుండా ఆ రోజునే అపాయింటెడ్ తేదీ ప్రకటించాలని టీఆర్ఎస్ పార్టీ తరపున పార్టీ అధికార ప్రతినిధి జగదీశ్వర్ రెడ్డి సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు.
2009 సంవత్సరంలో ఏర్పడిన శాసనసభ గడువు 2014 జూన్ 2న ముగుస్తుందనే ఉద్దేశంతో ఆ రోజే అపాయింటెడ్ డే గా కేంద్రప్రభుత్వం ప్రకటించిందని, కానీ ఏప్రిల్ 28నాడే శాసనసభ రద్దయ్యిందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈనెల 16న రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక వెంటనే మెజార్టీ స్థానాలు పొందిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానిస్తారని, అయితే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 17రోజుల సమయం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారిందని, ఈ మధ్యకాలంలో 294 మంది శాసనసభ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీల్లేదని జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.