టీఆర్ఎస్ పార్టీ నేతలు కొందరు సోమవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో సమావేశమై రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలంతా టీఆర్ఎస్ వైపు నిలబడ్డారని, ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటాయని, 75కు పైగా అసెంబ్లీ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చిన హామీల ప్రకారం టీఆర్ఎస్ మేనిఫెస్టోను నూటికి నూరుశాతం అమలుచేసి తీరుతామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలోని ప్రతి జిల్లాలోనూ టీఆర్ఎస్ కే ఆధిక్యం కనిపిస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎవరి మద్దతు అవసరం ఉండదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక్క పార్టీకే అధికారం అప్పగించాలని ప్రజలు భావించారు కాబట్టే టీఆర్ఎస్ కు మెజారిటీ స్థానాలు రానున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశంలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ పార్టీలు గల్లంతు అవుతాయని, ఒకసారి టీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే ప్రజలంతా టీఆర్ఎస్ కు ఓటు వేశారని, ఏ జిల్లాకు వెళ్ళినా ప్రజలు టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు. కేసీఆర్ ను కలిసిన వారిలో కేఎస్ రత్నం, పద్మారావు, హరీష్ రావు, లక్ష్మారెడ్డి, హరీశ్వర్ రెడ్డి, శంకర్ గౌడ్, దండె విఠల్, వేణుగోపాలాచారి, విద్యాసాగర్ రావు తదితరులు ఉన్నారు.